Legal Services | కోల్ సిటీ, మే 24: ఉచిత న్యాయ సేవలు అందుకోవడానికి పేద ప్రజలు మండల న్యాయ సేవ సమితిని సంప్రదించాలని మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్, డిస్ట్రిక్ట్, అడిషనల్ సెషన్స్ జడ్జి టీ శ్రీనివాస రావు సూచించారు. మండల న్యాయ సేవ సమితి ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో శనివారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
వరకట్న దురాచారం రూపుమాపడం, భ్రూణ హత్యలు అరికట్టడం, అవినీతి నిర్మూలించడానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలు తప్పు దారిలో పోకుండా ఉండేందుకు వారిలో జ్ఞానం పెంపొందడానికి విద్యా బుద్దులు నేర్పించాలని అన్నారు. క్షణికావేశంలోనే ఎక్కువ శాతం నేరాలు జరుగుతున్నాయన్నారు. నేరాలు జరగకుండా ఉండేందుకు ప్రతీ ఒక్కరూ తమ భావోద్వేగం, ఆవేశాన్ని నియంత్రించుకోవాలని సూచించారు. ఆలోచన అనేది మనిషికి దేవుడిచ్చిన వరమని అన్నారు.
మంచి ఆలోచనలతో క్రమశిక్షణ, నీతి , నిజాయితీతో సకాలంలో పనులు పూర్తి చేయాలని అన్నారు. సంపాదించిన ఆస్తులు శాశ్వతం కావని సంపాదించుకున్న పేరు మాత్రమే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. అలాగే సమాజ హితం కోసం అవసరమైన పక్షంలో ఎక్కువ సమయం కేటాయించి సిబ్బంది పని చేయాలని అన్నారు. కోవిడ్ విఫత్కర పరిస్థితుల్లో మున్సిపల్ కార్మికులు అందించిన సేవలను ప్రశంసించారు.
న్యాయవాది జీవన్ గ్లోరీ మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్మార్ట్ ఫోన్ వాడుతున్న పిల్లలు సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా తల్లిదండ్రులు గమనించాలన్నారు. ఈ సదస్సులో రామగుండం నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి, న్యాయవాదులు గుడికందుల భూమయ్య, గోలి తిరుపతి రావు, ఆర్ఓ ఆంజనేయులు, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, మెప్మా సీవోలు, ఆర్పీలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.