ధర్మపురి, జనవరి 31 : అప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్న విద్యార్థినులు మధ్యాహ్నం భోజనం చేసిన కొద్ది సేపటి నుంచే ఒక్కొక్కరుగా కడుపునొప్పితో తల్లడిల్లిపోయారు. తలతిప్పడం, వాంతులతో గంటలపాటు ఇబ్బంది పడ్డారు. అయితే పిల్లలను దవాఖానకు తరలించడంలో ప్రిన్సిపాల్, స్టాఫ్‌నర్స్ నిర్లక్ష్యం చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. విద్యార్థినులు, తల్లిదండ్రుల వివరాల ప్రకారం.. ధర్మపురిలోని మైనార్టీ బాలికల గురుకుల కళాశాలలో శుక్రవారం మధ్యాహ్నం విద్యార్థినులకు భోజనం అందించారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా కడుపునొప్పితో తల్లడిల్లిపోయారు. మొదట ఫస్టియర్ విద్యార్థిని కీర్తిమణి తనకు కడుపునొప్పి వస్తున్నదని కాలేజీ స్టాఫ్‌నర్స్‌కు చెప్పింది.
నెలసరి సమస్యగా చెప్పి ఎటువంటి మెడిసిన్ ఇవ్వకుండా విశ్రాంతి తీసుకోవాలని ఆమె సూచించింది. కొద్దిసేపటికే మరో విద్యార్థిని నందిని కూడా కడుపునొప్పితోపాటు వాంతులు వస్తున్నాయని చెప్పుకొన్నది. అప్పుడు స్టాఫ్ నర్స్ ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ లక్ష్మికి తెలిపింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఫస్టియర్ విద్యార్థినులు హుమేరియా, జుహా, సెకండియర్ విద్యార్థిని గుగులోత్ శ్రావ్య కూడా కడుపునొప్పి, వాంతులు అంటూ ప్రిన్సిపాల్ వద్దకు చేరుకున్నారు. వీరంతా మధ్యాహ్నం 3 గంటల వరకే ప్రిన్సిపాల్, స్టాఫ్‌నర్స్‌కు తెలిపారు. అయితే ఆ ఐదుగురు విద్యార్థినులను రాత్రి 8 గంటల వరకు ధర్మపురి ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. విద్యార్థులకు వైద్యుడు రాము చికిత్స అందించారు.
తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడంతోనే ఇలా జరిగి ఉంటుందని ఆయన తెలిపారు. ధర్మపురి ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న విద్యార్థులను విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం విద్యార్థులను రాత్రి 10గంటల ప్రాంతంలో జగిత్యాలలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు.
అయితే రెండు రోజుల క్రితమే ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి బియ్యం సరాఫరా అయ్యాయని, కొత్త బియ్యం కావడంతో సరిగా ఉడకలేదని, ఆ కారణంగానే ఇలా జరిగిఉంటుందని ప్రిన్సిపాల్ లక్ష్మి చెప్పారు. ఈ ఘటనపై విద్యార్థినుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పిల్లలు మధ్యాహ్నం నుంచి తల్లడిల్లితే రాత్రి 8గంటలకు దవాఖానకు పంపారని మండిపడ్డారు. ఆలస్యం చేయడం వల్లే తీవ్ర అస్వస్థత చెందారని వాపోయారు.