జగిత్యాల అర్బన్, డిసెంబర్ 22 : మళ్లీ కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ సూచించారు. జగిత్యాల మున్సిపల్ ఇన్చార్జి చైర్మన్ గోలి శ్రీనివాస్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎజెండాలోని అంశాలపై చర్చించి, పలు తీర్మానాలను ఆమోదించారు. సమావేశం అనంతరం కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే మాట్లాడారు. జగిత్యాల పట్టణంలో చెత్త సేకరణ తర్వాత ప్లాస్టిక్‌ను వేరు చేసి డంప్‌యార్డులకు తరలించాలని సూచించారు. ప్లాస్టిక్ వేరు చేయకుండానే టీఆర్‌నగర్‌లోని డంప్ యార్డుకు తరలించడం వల్ల చెత్త గుట్టల్లా పేరుకుపోయి డబుల్ బెడ్రూం కాలనీ వాసులకు, టీఆర్‌నగర్ వాసులకు ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించాలని సూచించారు. ప్రతి రోజూ కోటి లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నామని, లీకేజీలు లేకుండా అధికారులు జాగ్రత్త వహించాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ అనిల్‌కుమార్, డీఈ రాజేశ్వర్, మున్సిపల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. కాగా, రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మున్సిపల్ సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యేను మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు ఘన స్వాగతం పలికి, పుష్పగుచ్ఛాలు అందించి, ఘనంగా సత్కరించారు.