Sircilla | సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 4: సిరిసిల్ల నేత కార్మికుడు మరమగ్గం పై మరో అద్భుతాన్ని సృష్టించాడు. అగ్గిపెట్టెలో ఇమిడే చీర, దబ్బనం లో దూరే చీర ఇటువంటి ఎన్నో వినూత్న వస్త్రాలను రూపొందించిన సిరిసిల్ల కు చెందిన నల్ల విజయ్ మరోసారి తనదైన శైలిలో వినూత్న చీరను తయారు చేశారు.
గోల్డ్ జరీ చీరపై 20గ్రాముల బంగారాన్ని వినియోగించి తయారు చేసిన అబ్బురపరుస్తోంది. చీరపై రూపొందించిన పూల డిజైన్‌కు బంగారాన్ని వినియోగించారు. ఈ చీర 48 ఇంచుల వెడల్పు, 800గ్రాముల బరువు ఉంటుందని, తయారీకి 10రోజుల సమయం పట్టిందని విజయ్ తెలిపారు.
బల్లారికి చెందిన ఓ వ్యాపారి కూతురు వివాహం కోసం వారి ఆర్డర్ మేరకు ఈ చీరను ప్రత్యేకంగా తయారు చేసినట్లు చెప్పారు. విజయ్ గతంలో అనేక వినూత్న వస్త్రాలను తయారు చేసి ప్రముఖుల ప్రశంసలతో పాటు చేనేత కళారత్న అవార్డును పొందాడు.