Flight Tour | రామగిరి, మే 13 : విద్యార్థుల్లో ఉన్నత లక్ష్యాలు, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు బేగంపేట ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాంకిషన్ రావు వినూత్నంగా ప్రోత్సాహక కార్యక్రమం చేపట్టారు. పాఠశాలలో పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మండల స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థి శ్రీమంతుల పూర్ణచందర్ ను ప్రత్యేకంగా అభినందిస్తూ విమాన ప్రయాణం చేయించారు. విద్యార్థిని విమానంలో పర్యాటక ప్రాంతమైన విశాఖపట్నానికి తీసుకెళ్లి అక్కడి ప్రముఖ ప్రాంతాలను సందర్శింపజేశారు.
సాధారణ కుటుంబానికి చెందిన విద్యార్థికి ఇది జీవితంలో తొలి విమాన ప్రయాణం కావడంతో అతడు ఆనందం వ్యక్తం చేశాడు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ఇలాంటి ప్రోత్సాహకాలు అందిస్తే మరింత ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రేరణ కలుగుతుందని హెచ్ఎం రాంకిషన్ రావు తెలిపారు. హెచ్ఎం చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమాన్ని పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. విద్యార్థుల భవిష్యత్ కోసం ప్రభుత్వం పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ప్రోత్సాహక చర్యలు కూడా అవసరమని వారు పేర్కొన్నారు.