గురుకులాల్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. జగిత్యాల జిల్లాలో ఏడాది కాలంగా వరస ఘటనలు భయపెడుతున్నాయి. ఏడాది కింద పెద్దాపూర్ గురుకులంలో ఇద్దరు విద్యార్థుల మరణం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపగా, తరచూ ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ బాలికల గురుకుల పాఠశాలలో 30 మంది విద్యార్థినులకు అస్వస్థత చెందడం, ఆరుగురిని జగిత్యాల దవాఖానకు తరలించడంతో తల్లిదండ్రులు వణికిపోయారు. గురుకులాల్లో ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో గురుకులాలు గాడితప్పాయని ఆరోపిస్తున్నారు.
జగిత్యాల, జూలై 17 (నమస్తే తెలంగాణ)/ జగిత్యాల/ జగిత్యాల రూరల్ : జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలోని మహాత్మా జ్యోతిబాఫూలే బాలికల గురుకులంలో ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. 570మంది విద్యార్థులు గురుకులంలో విద్యాభ్యాసం చేస్తున్నారు. గురుకుల పాఠశాలలో బుధవారం మధ్యాహ్నం, రాత్రిపూట చేసిన భోజనాలు విషతుల్యం కావడంతో విద్యార్థినులు ఒకరి తర్వాత మరొకరు వాంతులు చేసుకున్నారు.
కడుపునొప్పితో తల్లడిల్లిపోయారు. మొత్తం 30మంది విద్యార్థినులు ఫుడ్ పాయిజన్‌కు గురి కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వైద్య శిబిరం నిర్వహించి విద్యార్థినులకు వైద్య పరీక్షలు చేయించారు. అయితే ఆరో తరగతి విద్యార్థినులు సాత్విక, శ్రీనిక, తొమ్మిదో తరగతి విద్యార్థిని పరిచయ, పదో తరగతి విద్యారిన్థులు లక్ష్మీప్రసన్న, శీజ, ఎనిమిదో తరగతి విద్యార్థిని పూలే శ్రీజ తీవ్రమైన కడుపునొప్పి, వాంతులకు లోనయ్యారు. శ్రీజ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో గురుకుల సిబ్బంది ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేశారు.
దీంతో శ్రీజ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో తండ్రి ఒక ప్రైవేట్ దవాఖానలో చేర్చించారు. మిగిలిన ఐదుగురు విద్యార్థినులను జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్‌కు దవాఖానకు తరలించారు. విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు హుటాహుటిన గురుకులానికి చేరుకున్నారు. ఉదయం సంఘటన జరిగితే మధ్యాహ్నం వరకు సమాచారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా అస్వస్థతకు గురైన విద్యార్థినుల్లో కొందరిని ఇండ్లకు తీసుకొని వెళ్లిపోయారు.
వరుసగా ఘటనలు
గురుకులాల్లో ప్రమాదఘంటికలు మోగుతూనే ఉన్నాయి. జగిత్యాల జిల్లాలో ఏడాది కాలంగా దుర్ఘటనలు, ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గత విద్యా సంవత్సరం మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకులలో ఇద్దరు విద్యార్థులు విషకీటకంతో మృతిచెందగా, నలుగురు విద్యార్థులు చావు అంచుల వరకు వెళ్లి వచ్చారు. ఈ సంఘటన రాష్ట్రంలోనే తీవ్ర సంచలనం సృష్టించింది. పదిహేను రోజుల క్రితం అదే పెద్దాపూర్ గురుకులానికి చెందిన విద్యార్థి హఠాత్తుగా అస్వస్థతకు గురికాగా, దవాఖానకు తరలించి చికిత్స నిర్వహించారు.
చికిత్స సందర్భంలో విద్యార్థి విషపు పురుగుకాటుకు గురైనట్టు వైద్యులు అనుమానం వ్యక్తం చేశారు. పెద్దాపూర్ గురుకులంలో అసలు ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొన్నది. అలాగే పెగడపల్లి మండలానికి చెందిన గురుకుల విద్యార్థులు గత విద్యా సంవత్సరంలో ఫుడ్ పాయిజనింగ్‌కు గురై తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని జగిత్యాల దవాఖానకు తరలించి, ఆక్సిజన్ పెట్టి చికిత్స అందించాల్సి వచ్చింది. ధర్మపురి మండలంలోని గురుకుల పాఠశాలలోనూ ఫుడ్‌పాయిజనింగ్ కేసు నమోదైంది.
ఆందోళనలో తల్లిదండ్రులు
గురుకులాల్లో వరుసగా ఫుడ్ పాయిజనింగ్ కేసులు, ఇతర సమస్యలు తలెత్తుతుండడంపై పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రభుత్వం గురుకుల పాఠశాలలను పట్టించుకోవడం లేదని, కనీస వసతులు కల్పించడం లేదేని, భోజనం కూడా సరిగ్గా పెట్టడం లేదని ఆగ్రహిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గురుకులాల్లో తమ పిల్లలకు నాణ్యమైన ఆహరం, విద్య, వసతి, ఇతర సౌకర్యాలు అందాయని, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో పరిస్థితి దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం గురుకులాల్లో చేర్పిస్తే, ప్రాణాల ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోయిందని ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలపై నిర్లక్ష్యం చూపుతున్నదని, అందుకే ఏదో ఒక ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు.
సర్కారు మొద్దునిద్ర లేవాలి : జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత
లక్ష్మీపూర్ గురుకులంలో ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థినులు అస్వస్థతకు గురికావడం బాధాకరమని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలు జరుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగిత్యాల ఎంసీహెచ్‌లో చికిత్సపొందుతున్న విద్యార్థులను బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆమె పరామర్శించారు. విద్యార్థినులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యం చెప్పారు, బీఆర్ఎస్ ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం మాట్లాడుతూ, ఇది వరకు జిల్లాలో ఇలాంటి ఘటనలు చాలా జరిగినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ సర్కారు విద్యారంగంలో రాష్ర్టాన్ని ఆదర్శంగా నిలిపితే.. రేవంత్ సర్కారు భ్రష్టు పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గురుకులాలపై పట్టింపేదీ?
కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వంతో గురుకులాలు గాడితప్పాయి. విద్యార్థులు ‘అన్నమో రామచంద్రా’ అంటూ రోడ్డెక్కాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. లక్ష్మీపూర్ బాలికల గురుకులంలో ఫుడ్ పాయిజన్ అయి 30మందికిపైగా విద్యార్థినులు అస్వస్థతకు గురికావడం బాధాకరం. ఈ ఘటనపై ఆ శాఖ మంత్రి ఇప్పటికీ ఎందుకు స్పందించడం లేదు. ప్రభుత్వంలో సంబంధితశాఖలకు మంత్రి ఉన్నట్టా.. లేనట్టా..? సాంఘిక, సంక్షేమ, మైనారిటీ, గిరిజనశాఖ మంత్రి ఒక గురుకుల పాఠశాలను కూడా సందర్శించలేదు. గురుకుల వసతి గృహాల్లో ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని తల్లిదండ్రులు భయపడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో గురుకులాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాబోధన అందించాం. రుచికరమైన భోజనం అందించాం. కానీ, ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో పరిస్థితి అధ్వానంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. శాశ్వత పరిషారం చూపాలి.
– మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్