కరీంనగర్ రూరల్, జూన్ 8: దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మత్స్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని రెవెన్యూ గార్డెన్స్‌లో గురువారం ఏర్పాటు చేసిన ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ అదిరింది. ఈ నెల 10వ తేదీ వరకు దీనిని నిర్వహించనుండగా, మొదటిరోజు విశేష స్పందన లభించింది. 21 స్టాళ్లు ఏర్పాటు చేసి, వివిధ రకాల చేపల వంటకాలను ప్రదర్శించారు. చేపల ఫ్రై, బిర్యానీ, పులుసు, ప్రాన్స్ బిర్యానీలను సరసమైన ధరలకు విక్రయించారు. వంటకాలు నోరూరించడంతో ఆహారప్రియులు ఎగబడ్డారు. ఈ ఫెస్టివల్‌ను రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసి ఫిష్ వంటకాల స్టాల్స్‌ను ఆయన సందర్శించారు. వివిధ రకాలు చేపల ఫ్రై, బిర్యానీ, టైగర్ రొయ్యల ఫ్రై రుచిచూశారు. కార్యక్రమంలో మేయర్ యాదగిరి సునీల్‌రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్, గంగాధర కనుకయ్య, గుర్రల మల్లేశం, పలు మండలాల మత్స్యశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మత్స్యరంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
మత్స్య రంగ అభివృద్ధిపై రాష్ట్రం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాలోని చెరువులు, కుంటలు నిండు వేసవిలో మత్తళ్లు దుంకుతున్నాయి. కరీంనగర్ జిల్లా రాష్ట్రంలోనే మత్స్య సంపదకు అనుకూల మైన జిల్లా. దిగువ మానేరు జలాశయంలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఎల్లప్పుడూ నిండుకుండలా నీరు ఉంటున్నది. దీని ద్వారా జిల్లాలోని అన్ని చెరువులను నీరు నింపడంతో జలకళ ఉట్టి పడుతున్నది. దీంతో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. జిల్లాలో చెరువులు, కుంటలు, జలాశయాల్లో చేప పిల్లలను వదిలేందుకు 10.45కోట్లు ఖర్చు చేశాం. 2014వరకు మత్స్యకారులకు 4.71కోట్లు ఆదాయం వచ్చేది. అది 2022-23 నాటికి 51.70కోట్లకు చేరింది. రొయ్య పిల్లల ద్వారా 2018 నాటికి 5.52 కోట్ల ఆదాయం వచ్చేది. అది 2023-23 నాటికి 10.77కోట్లకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం చెరువుల్లో ఉచితంగా రొయ్యలు, చేప పిల్లలను విడుదల చేస్తున్నది. చేపల ఆహారం ఆరోగ్యానికి వరం. రాష్ట్ర ప్రభుత్వం చేపల పండుగ నిర్వహించి చేపల వంటలపై ప్రజలకు అవగాహన పెంపొందించేందుకు కృషి చేస్తున్నది. జిల్లాకేంద్రంలో నిర్వహిస్తున్న ఫిష్ ఫుడ్ ఫెస్టివల్‌ను విజయవంతం చేయాలి
-గంగుల కమలాకర్, మంత్రి
సద్వినియోగం చేసుకోవాలి..
ఫిష్ ఫెస్టివల్లో 21 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్‌లో వివిధ రకాల చేపల వంటకాలు, బిర్యానీ వంటి వంటకాలు చేసి పెట్టారు. నగర వాసులు ఈ అవకాశా న్ని వినియోగించుకోవాలి. చేపలు తినడం ద్వారా 112 క్యాలరీల పోషకాలు, 19.7 గ్రాముల ప్రొటీన్లు, 2.6 గ్రాముల కొవ్వు పదార్థాలు, 3.0 గ్రాముల కార్బొహై డ్రేట్లు, 345 మిల్లీ గ్రాములు కాల్షియం, ఇంకా ఫాస్పరస్, ఐరన్ లభిస్తాయి.
– దేవేందర్, జిల్లా మత్స్యశాఖ అధికారి