Social activist | కరీంనగర్ కలెక్టరేట్, సెప్టెంబర్ 03 : నిబంధనలు పాటించకుండా రోడ్డుపై ప్రయాణించే వాహన చోదకుల వద్ద ఇష్టారాజ్యంగా జరిమానాలు వసూలు చేస్తున్న అధికారులు రోడ్ల మరమ్మత్తులు మాత్రం చేపట్టకపోవడాన్ని నిరసిస్తూ, నగరంలోని ఓ సామాజిక కార్యకర్త బుధవారం వినూత్న నిరసనకు దిగాడు. గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రధాన రహదారులన్నీ దెబ్బతినగా, మరమ్మత్తులు చేపట్టకపోవటంతో వాహనచోదకులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.
కొన్నిచోట్ల ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయి. అయినా, అధికారులు గానీ, ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోకపోవటంతో పాడైన రోడ్లపై ప్రయాణిస్తూ వాహనచోదకులు అనేక ఇక్కట్లు పడుతుండటం షరా మామూలుగా మారింది. నిత్యం వందలాది వాహనాలు ప్రయాణించే జగిత్యాల- కరీంనగర్ జాతీయ రహదారిపై గుంతలు పడి పక్షం రోజులు గడుస్తున్నా చోద్యం చూస్తుండటాన్ని నిరసిస్తూ, నగరానికి చెందిన సామాజిక కార్యకర్త కోట శ్యామ్‌కుమార్ అధికారుల తీరును ప్రశ్నిస్తూ ప్లకార్డు చేతపట్టి తలకు హెల్మెట్ ధరించి గుంతలమయమైన రహదారిపై బైఠాయించారు. రెండు గంటల పాటు అలాగే రోడ్డుపై కూర్చోవటంతో అటు గుండా ప్రయాణించే వారంతా ఆసక్తిగా గమనించి, రోడ్లు భవనాల శాఖ అధికారులపై మండిపడుతూ చర్చించుకోవటం కనిపించింది.
ఈ సందర్భంగా కోట శ్యాం కుమార్ మాట్లాడుతూ.. చిరు జల్లులకే కరీంనగర్ నిజామాబాద్ ప్రధాన రహదారి చిత్తడిమయమవుతూ, గుంతలు పడుతున్నాయని ఆరోపించారు. పలుసార్లు ప్రమాదాలు జరిగినా మాకెమి తెలియదన్నట్లుగానే యంత్రాంగం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఆర్ అండ్ బి అధికారులకు అనేక సార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవటం లేదని, నిబంధనల సాకుతో, హెల్మెట్ ధరించకున్నా, కాగితాలు సక్రమంగా లేకున్నా, వాహనదారులపై అనేక రకాల జరిమానాలు విధిస్తూ, బహిరంగ దోపిడీకి పాల్పడుతున్న అధికారులు, రహదారులను సక్రమంగా నిర్వహించకపోవటంపై నాకెంత జరిమానా చెల్లిస్తారో చెప్పాలంటూ ప్లకార్డు ప్రదర్శించారు.
అనంతరం ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. కాగా, శ్యాం కుమార్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న వైనం పలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నది.