హుజూరాబాద్ టౌన్, సెప్టెంబర్ 11: హుజూరాబాద్ డివిజన్లో రెండురోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి చెరువులు నిండుకుండల్లా మారాయి. వాగులు పొంగిపొర్లుతున్నాయి. చెక్‌డ్యాంలు మత్తడి దుంకుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హుజూరాబాద్ పట్టణంతో పాటు మండలంలో శనివారం నుంచి ఆదివారం ఉదయం 8గంటల వరకు 81.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో చిలుకవాగు జోరుగా పారుతున్నది. పట్టణంలో లోతట్టు ప్రాంతాలైన కిందివాడ, మామిండ్లవాడ, గ్యాస్‌గోదాం ఏరియా, ఏక్‌మినార్ ఏరియా, గాంధీనగర్, బుడగజంగాలకాలనీ, ఎస్డబ్ల్యూకాలనీ, సిద్ధార్థనగర్, కొత్తపల్లి, ఇందిరానగర్‌లోని సిక్కులవాడ, బోర్నపల్లి తెనుగువాడ, దమ్మక్కపేట ఎస్సీకాలనీ, ఇప్పల్‌నర్సింగాపూర్ ఎస్సీకాలనీలో పలువురి ఇండ్లల్లోకి వరద నీరు చేరింది. మామిండ్లవాడ, సిక్కులవాడ, గొల్లవాడలో రోడ్లపై భారీగా నీరు నిలువడంతో స్థానిక కౌన్సిలర్లు సహాయక చర్యలు చేపట్టారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల క్రీడామైదానాలు వరదనీటితో నిండి చెరువులను తలపిస్తున్నాయి. మోడల్ చెరువు నిండి తూము గుండా నీరు బయటకు పారింది. సమీపంలోని ఓపెన్ జిమ్ పూర్తిగా నీట మునిగింది. లోతట్టు ప్రాంతాల్లో ఆయా కౌన్సిలర్లు, బల్దియా అధికారులు, సిబ్బంది పర్యటించారు. సహాయక చర్యలు చేపట్టారు. శిథిలమైన ఇండ్లల్లో ఎవరూ ఉండొద్దని సూచించారు.
సైదాపూర్‌లో..
సైదాపూర్, సెప్టెంబర్ 11: మండలంలో శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. 115.6 ఎంఎం వర్షపాతం నమోదైంది. వరదనీటి ప్రవాహానికి మండలంలోని పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. సైదాపూర్, సోమారం, ఎక్లాస్పూర్ గ్రామాల్లోని కల్వర్టుల వద్ద వరదనీటి ప్రవాహం కారణంగా రాకపోకలకు అంతరాయం కలిగింది.
వరదలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన గ్రామస్తులు
మండలకేంద్రంలోని సైదాపూర్ కల్వర్టు వద్ద వరదనీరు ఉధృతంగా ప్రవహించింది. ఓ వ్యక్తి బైక్‌పై కల్వర్టు దాటుతూ వరదనీటి ప్రవాహానికి కొట్టుకుపోతుండడంతో అక్కడే ఉన్న స్థానికులు రవితేజ, సాయిచరణ్రాజ, చంటి తదితరులు వెంటనే స్పందించారు. తాడు సాయంతో బైక్‌తోపాటు సదరు వ్యక్తిని నీటిలో నుంచి బయటకు తీశారు.
మత్తడి దుంకుతున్న చెక్‌డ్యాంలు
మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు మండలంలోని వాగులు పొంగిపొర్లుతుండగా చెక్‌డ్యాంలు మత్తడి దుంకుతున్నాయి. మండలంలో మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండగా ఆదివారం వాన దంచికొట్టింది. దీంతో మండలంలోని వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయి. కనపర్తి, నర్సింగాపూర్, బేతిగల్ గ్రామాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇండ్లల్లోకి నీరు చేరగా, నర్సింగాపూర్‌లో శీలం మల్లారెడ్డి ఇంటిపై చెట్టు విరిగిపడి ఇల్లు కూలిపోయింది. ఎల్ఎండీ గేట్లు ఎత్తడంతో మానేరువాగు పరీవాహక గ్రామాలైన ఇప్పలపల్లి, చల్లూరు, మల్లారెడ్డిపల్లి, కోర్కల్, నర్సింహులపల్లి, కొండపాక గ్రామాల ప్రజలను తహసీల్దార్ రాజయ్య, ఎస్ఐ శేఖర్‌రెడ్డి అప్రమత్తం చేశారు. భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరారు.