Fee reimbursement | పెద్దపెల్లి టౌన్ జులై 7 : రేవంత్ రెడ్డి సర్కార్ అధికారం చేపట్టి 18 నెలలు గడుస్తున్న విద్యారంగాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని, విద్యార్థులకు రావాల్సిన రూ.8వేల కోట్ల బకాయి బిల్లులు, ఫీజు రియింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులను విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్, జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లెల్ల ప్రశాంత్ డిమాండ్ చేశారు.
కలెక్టరేట్ ఎదుట పెండింగ్ స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ధర్నా చేపట్టారు. విద్యార్థులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు రాకపోయే సరికి విద్యా సంస్థల యాజమాన్యాలు, తల్లిదండ్రుల నుండి ముక్కు పిండి బకాయి బిల్లులు వసూలు చేస్తున్నాయని ఆవేదన చెందారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను గుర్తించి పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అరవింద్, నరేష్, అభిరామ్, అభివర్ధన్, కావ్య తదితరులు పాల్గొన్నారు.