Ramagundam Baldiya | కోల్ సిటీ, జూలై 18: పైన పటారం.. లోన లొటారం అన్నట్టుంది రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం పరిస్థితి. రాత్రి వేళ భయానక వాతావరణం నెలకొంటుంది. కార్యాలయం వెనుకాల మైదానంలో భారీగా స్క్రాప్ పేరుకుపోవడం.. జంగల్ ను తలపించేలా పిచ్చి మొక్కలు పెరగడంతో పాములు, విష కీటకాలకు ఆవాసంగా మారుతోంది. విద్యుత్ దీపాలు ఉన్నా అవి సక్రమంగా వెలగడం లేదు. దీంతో అపరిచిత వ్యక్తులు వచ్చి వెనుకాల అడ్డాగా మార్చుకుంటున్నారు. అప్పుడప్పుడు మద్యం సిట్టింగ్లు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది.
కాగా, అక్కడ ఆదర్శ మహిళా స్వశక్తి గ్రూపునకు చెందిన ఉమారాణి అనే మహిళ మున్సిపల్ టెండర్ ద్వారానే జిరాక్స్ సెంటర్ నడుపుతోంది. చుట్టూ పిచ్చి మొక్కలు ఏపుగా పెరగడంతో విష కీటకాలు, పాములు అప్పుడప్పుడు వస్తుండటంతో భయాందోళన చెందుతున్నారు. గతంలో పెద్ద పెద్ద పాములు వచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. వివిధ అవసరాల నిమిత్తం ఆఫీసుకు వచ్చేవారు జిరాక్స్ ల కోసం బయటకు వెళ్లి రోడ్డు దాటి వెళ్లాలి. అప్పుడు ఏదైనా ప్రమాదాలు జరిగితే బాధ్యులెవరని ప్రశ్నిస్తున్నారు.
కార్యాలయం వెనుకాల ఉన్న జిరాక్స్ సెంటర్ ముందుకు మార్చితే ఈ సమస్య ఉండకపోగా అందరికీ వినియోగంగా కూడా ఉంటుంది. కాగా, వర్షాకాలం కావడంతో ఆవరణలో మొత్తం పిచ్చిమొక్కలు దట్టంగా పెరిగాయి. అలాగే పాడైన వివిధ మున్సిపల్ వాహనాలు, డస్ట్ బిన్ల స్క్రాప్ కుప్పలుగా పెరుకుపోయాయి. దీంతో పాములు, తేళ్లు ఇతరత్రా విషపు పురుగులు సంచరిస్తున్నాయి. అవి సాయంత్రం పూట బయటకు వస్తుండడంతో ఎప్పుడు ఏ కాలుకు ఏ పురుగు కుడుతుందోనని జిరాక్స్ సెంటర్ నిర్వాహకులు భయాందోళన చెందుతున్నారు.
ఎలక్ట్రికల్ విభాగం అధికారి నిర్లక్ష్యంతో విద్యుత్ లైట్లు వెలగడం లేదన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వ కార్యాలయంలో వెనకాల ఖాళీ స్థలం ఉండడంతో ఆకతాయిలు వచ్చి మద్యం తాగుతున్న వైఫల్యం ఎవరిదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అక్కడే రాత్రిపూట మున్సిపల్ కాంట్రాక్టర్లు సైతం గుమి గూడి గంటలపాటు గడుపుతుంటారు.
ఈ విషయమై నగర పాలక సంస్థ కమిషనర్ అరుణశ్రీని వివరణ కోరగా త్వరలోనే కార్యాలయం ఆవరణలోని పిచ్చి చెట్లను పూర్తిగా తొలగించి చదును చేయిస్తామని తెలిపారు. ఆఫీసు వేళలు ముగిసాక లోపలికి ఎవరూ రావొద్దనీ, ఒకవేళ అపరిచిత వ్యక్తులు వస్తున్నట్లు తన దృష్టికి వస్తే తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.