‘నాన్నా.. అమ్మాయి పుడితే మహాలక్ష్మీ అంటారు కదా! కానీ, మేమేం పాపం చేసినం. ఆడపిల్లలుగా పుట్టడమే మేం చేసినా తప్పా.. మేం పుట్టినప్పటి నుంచే ఇద్దరు బిడ్డలని అమ్మను తిడుతున్నవ్.. గొడవ పెట్టుకుంటున్నవ్.. మాకేం తెలుసు నాన్నా.. ఆడపిల్లలుగా పుట్టడం నేరమని! మా చిరునవ్వులైనా నిన్ను మారుస్తయి అనుకున్నం. మేం పెరుగుతున్నా కొద్దిగా మారుతవ్ అనుకున్నం. కానీ, నీ మనసు కరుగకపాయె నాన్నా.. ఎంత పనిచేసినవ్ నాన్నా.. మా ప్రాణాలు తీసేదాకా నీకు సంతోషం కలుగలేదా నాన్నా’ అంటూ ఆ నాలుగేళ్ల కవలల ఆత్మగోష ఇలానే తల్లడిల్లి ఉంటుదేమో! ఆడపిల్లలు పుట్టారని ఆ తండ్రి తన ఇద్దరు పిల్లలకు గడ్డి మందు తాగించి, బావిలో పడేసి చంపేయడం ప్రతి ఒక్కరినీ కలిచివేసింది.
కరీంనగర్ రూరల్, ఏప్రిల్ 3 : కరీంనగర్ రూరల్ పోలీసుల వివరాల ప్రకారం.. జూబ్లీనగర్‌కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి కచ్చు శ్రీశైలం, మౌనిక దంపతులకు కవలలు గీత అన్విత(4), గీత అనిషి(4) ఉన్నారు. అయితే, వీరు ఆడపిల్లలు కావడంతో పుట్టినప్పుటి నుంచే తండ్రి అయిష్టం పెంచుకున్నాడు. పిల్లలు కండ్ల ముందే పెరుగుతున్నా కనీసం మనసు కరుగక పోగా.. ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చావంటూ తరచూ భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈ విషయమై గ్రామ పెద్దలు, బంధువులు సర్దిచెప్పినా వినకుండా.. తనకు భార్యా పిల్లలు వద్దని అనేకసార్లు గొడవలకు దిగాడు. శుక్రవారం తన ఇంటి పక్కన ఉండే తమ్ముడు, మరదలు పెద్దాపూర్ జాతరకు వెళ్లడం.. ఇంట్లో భార్యా, పిల్లలు తప్ప ఎవరూ లేకపోవడంతో ఇదే అదునుగా భావించాడు.
ఇంట్లో ఉన్న భ్యారతో గొడవ పడి ఇద్దరు పిల్లలను తీసుకుని పొలానికి వెళ్లాడు. అక్కడే వారికి గడ్డి మందు తాగించి, తర్వాత పిల్లలను వ్యవసాయ బావిలో పడేశాడు. పిల్లలను తీసుకొని వెళ్లిన శ్రీశైలం.. తిరిగి ఒంటరిగా రావడం చూసిన స్థానికులు అతడిని ప్రశ్నించడంతో నిజం చెప్పాడు. దీంతో గ్రామస్తులు శ్రీశైలంకు దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్ధలానికి చేరుకున్న పోలీసులు.. బావిలో వెతకగా ఒకరి మృతదేహం లభించింది. కరీంనగర్ నుంచి రెస్క్యూ టీమ్‌ను పిలిపించి బావిలోని నీటిని తొలగించడంతో మరో మృతదేహం లభ్యమైంది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కరీంనగర్ రూరల్ సీఐ ఏ నిరంజన్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.