suicide attempt | కలెక్టరేట్, సెప్టెంబర్ 15: కన్న కొడుకు, కోడలు తనకున్న ఆస్తిని గుంజుకుని తనను పట్టించుకోవడంలేదని మనస్థాపానికి గురైన ఓ వృద్ధుడు ప్రజావాణి కార్యక్రమంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన అజ్మీర విట్టల్ కలెక్టరేట్లోని ప్రజావాణి కార్యక్రమంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కాగా ప్రజావాణికి విట్టల్ తన భార్య వీరభద్రతో కలిసి వచ్చాడు.
తన కుమారుడు నరేష్ కోడలు సరిగా పోషించడం లేదని, ఉన్న భూమిని కూడా వారే సాగు చేసుకుంటూ తమకు అన్నం పెట్టడం లేదని కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయిందని ఆవృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగగా అక్కడ ఉన్న సిబ్బంది స్పందించి సిరిసిల్ల ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి కలెక్టర్ వాహనంలో తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా కలెక్టరేట్ వద్ద విటల్ భార్య వీరభద్ర మాట్లాడుతూ తన కొడుకు నరేష్ తమను పోషించడం లేదని ఆరోపించింది. అంతేకాకుండా ఇంట్లోంచి తమను వెళ్లగొట్టి తమను చంపుతామని బెదిరిస్తున్నాడని, పెద్ద మనుషులు పోలీసుల సమక్షంలో మాట్లాడినా తమకు న్యాయం జరగడంలేదని వృద్ధురాలు వాపోయింది. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే మనస్థాపానికి గురైన విట్టల్ పురుగుల మందు తాగాడని పేర్కొంది. ప్రస్తుతం విఠల్ సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.