Fashion show | కోల్ సిటీ, ఏప్రిల్ 6: ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ (ఐబీఏ) ఆధ్వర్యంలో గోదావరిఖని మార్కండేయ కాలనీలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో తొలిసారిగా నిర్వహించిన రామగుండం నియోజక వర్గ స్థాయి ఫ్యాషన్ షో అలరించింది.
దేశ వ్యాప్తంగా మహిళల ఆత్మవిశ్వాసంను పెంపొందించేందుకు ఫ్యాషన్ రంగంలో సృజనాత్మకతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ఫ్యాషన్ షో నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్, కన్జ్యూమర్ ఫోరం ప్రతినిధి చేతన సోనీలు ముఖ్యతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
మహిళలు ప్రతి రంగంలో తమ ప్రతిభను చాటుతున్న తరుణంలో ఈ ఫ్యాషన్ ప్లాట్‌ఫాంలు మహిళా శక్తిని ప్రదర్శించేందుకు వేదికలుగా మార్చుకోవాలని పలువురు వ్యాఖ్యానించారు. అనంతరం జరిగిన ఫ్యాషన్ షోలో మహిళలు, యువతులు తమదైన శైలిలో వేషధారణలతో పాల్గొని అలరించారు. న్యాయ నిర్ణేతల చేతుల మీదుగా విజేతలకు సర్టిఫికెట్లు, ట్రోఫీలు అందజేశారు. ఇందులో ప్రముఖ మోడల్స్, ఫ్యాషన్ డిజైనర్లు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఐబీఏ ప్రతినిధులు పలువురు మహిళలు పాల్గొన్నారు.