మొన్నటి దాకా సాగు పండుగలా సాగింది. కానీ, నేడు ప్రశ్నార్థకంగా మారుతున్నది. పెద్దపల్లి జిల్లాలోని ఎస్సారెస్పీ చివరి ఆయకట్టుకు సాగునీరు అందని పరిస్థితి ఉన్నది. డీ-83 కింద మంథని, ముత్తారం మండలాల్లో దాదాపుగా 10 వేలకు పైగా ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే పంటలు మొత్తంగా దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెర్రెలు పారుతున్న పొలాలను చూసి కన్నీళ్లు పెడుతున్నారు. పూర్తి స్థాయిలో సాగు నీరందించడంలో ప్రభుత్వం విఫలమైదంటూ ఆరోపిస్తున్నారు. పెట్టుబడులు కూడా వచ్చేలా లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెద్దపల్లి, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ద్వారా సాగు నీటిని సరఫరా చేసే డీ-83, డీ-86 కాలువలు పెద్దపల్లి జిల్లా రైతాంగానికి జీవనాధారమైనవి. డీ-86 కాలువ కింద కరీంనగర్, సుల్తానాబాద్, కాల్వశ్రీరాంపూర్, ఓదెల, ఎలిగేడ్, జూలపల్లి, పెద్దపల్లి మండలాల్లోని 86 వేల ఎకరాలకు సాగు నీరు అందించాల్సి ఉండగా, ఇప్పటికైతే ఈ ఆయకట్టుకు పెద్దగా ఇబ్బంది లేదు. కానీ, డీ-83 కింద మాత్రం మప్పు ముంచుకొస్తున్నది.
డీ-83 కాలువ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని చొప్పదండి మండలం రేవెళ్లి నుంచి ప్రారంభమై, పెద్దపల్లి జిల్లాలోని ఎలిగేడు, జూలపల్లి, ధర్మారం, పాలకుర్తి, పెద్దపల్లి, అంతర్గాం, రామగుండం, కాల్వ శ్రీరాంపూర్, కమాన్‌పూర్ మండలం గుండారం రిజర్వాయర్ వరకు 42 కిలో మీటర్లు ప్రవహించి, అక్కడి నుంచి రైట్‌సైడ్ బ్రాంచ్ (ఆర్ఎస్బీ) కెనాల్‌గా రామగిరి, ముత్తారం, మంథని మండలాల మీదుగా 41 కిలో మీటర్లు ప్రవహించి మంథని మండలం ఖానాపూర్ వరకు చేరుతుంది. సుమారు 202 గ్రామాలకు సాగునీరు సరఫరా చేస్తుంది. ఈ డీ-83 కాలువ కింద సుమారు 65 మైనర్(ఉప) కాలువలు ఉండగా, మొత్తం 1.26 లక్షల ఎకరాలకు సాగునీరు సరఫరా చేయాల్సి ఉన్నది. అయితే, చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందే పరిస్థితి లేదు.
గతేడాది కేసీఆర్ సర్కారు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని సకాలంలో సమృద్ధిగా విడుదల చేయడంతో ఎలాంటి సమస్య రాలేదు. కానీ, ఈ సారి పరిస్థితి మారింది. డిసెంబర్ నుంచే ఎస్సారెస్పీ నీళ్లు ఇవ్వాల్సి ఉన్నా.. ఈసారి జనవరి 15వ తేదీ నుంచి ఇస్తున్నారు. యాసంగిలో వారబందీ పద్ధతిలో పంటలకు నీరందిస్తామని అధికారులు చెప్పినా.. అమలుకు నోచుకోలేదు. 15 రోజుల క్రితం కాలువ ద్వారా నీటిని విడుదల చేసినా.. అది కూడా గతం కంటే తక్కువగా ఇవ్వడంతో డీ-83 ప్రధాన కాలువ ద్వారా చివరి ఆయకట్టుకు నీరు చేరలేదు. ప్రధానంగా మంథని, ముత్తారం మండలాల్లోని ఎస్సారెస్పీ ఆయకట్టుకు 20 రోజులుగా కాలువ నీరు రాకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. దాదాపు 10 వేలకు పైగా ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతినే ముప్పు కనిపిస్తున్నది.
మంథని మండలం పుట్టపాక, లకేపూర్, గాజులపల్లి, మైదుపల్లి, కాకర్లపల్లి, గద్దలపల్లి, గోపాల్పూర్, చిన్నఓదాల, ఎక్లాస్పూర్, రామగిరి మండలం లద్నాపూర్, ఆదివారంపేట, రామయ్యపల్లి, ముత్తారం మండలం రామకిష్టాపూర్, సీతంపల్లి, ఖమ్మంపల్లి గ్రామాల పరిధిలో పంట పొలాలు దెబ్బతిన్నాయి. ఎక్కడ చూసినా బీటలు వారి కనిపిస్తున్నాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటలను రక్షించుకునేందుకు వాగులు, వంకలు, వ్యవసాయ బావులు, కుంటలకు బోర్లు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకోసం వేలకు వేలు వెచ్చించి మోటర్లు, పైపులు కొనుగోలు చేస్తున్నారు. స్థోమతలేని రైతులు మాత్రం పొలాలను అలాగే వదిలేస్తున్నారు. కండ్లముందే ఎండుతున్న పంటలను చూసి కన్నీరుమున్నీరవుతున్నారు. ఈసారి పెట్టుబడులు నిండా మునగాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. సర్కారు ఆదుకొని సాగునీరివ్వాలని వేడుకుంటున్నారు.
ఎండిన పొలంలో తలపట్టుకొని కనిపిస్తున్న రైతు మంథని మండలం కాకర్లపల్లికి చెందిన బూడిద రమేశ్. గతేడాది డీ-83 కెనాల్ ద్వారా చివరి ఆయకట్టుకు పుష్కలంగా నీళ్లు రావడంతో ఆరెకరాల భూమి కౌలుకు తీసుకొని బంగారం లాంటి పండించిండు. ఈసారి కూడా నీళ్లు పుష్కలంగా వస్తాయనే ఆశతో మళ్లీ ఆరెకరాల్లో వరి వేసిండు. సాగు కోసం 1.50 లక్షలు ఖర్చు పెట్టిండు. కానీ, ఈసారి చివరి ఆయకట్టుకు నీరందే పరిస్థితి లేక ఆగమవుతున్నడు. ఇప్పటికే ఎండిన పొలాన్ని చూసి కన్నీళ్లు పెడుతున్నడు. పంటను కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నడు. సమీపంలో ఉన్న జలవనరుల నుంచి నీటిని తరలించేందుకు పైపులు కొన్నడు. అయినా, పంట దక్కుతుందన్న ఆశ లేక ఆందోళన చెందుతున్నడు. కౌలు ఎట్ల కట్టాలె? మిత్తికి తెచ్చినకాడ అసలెట్ల కట్టాలె? నేనెట్ల బతుకాలె.. కుటుంబాన్ని ఎట్ల పోషించాలె? అని రంది పడుతున్నడు. సర్కారుకు సరైన అవగాహన లేకపోవడంతో నష్టపోయే పరిస్థితి వచ్చిందని మండిపడుతున్నడు. సాగునీరిచ్చి పంటలను కాపాడాలని వేడుకుంటున్నడు.
ఇన్నేండ్లల్ల ఇట్ల పంట ఎండిపోవుడు మొదటిసారి కావచ్చు. మునుపెన్నడూ ఇట్ల తడి అందక పంట ఎండిపోలె. ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు రామకిష్టాపూర్ మాది. నాకు ఆరెకురాల పొలం ఉన్నది. ఇక్కడ మూడెకరాలు ఎస్సారెస్పీ కాల్వకింద. ఇంకోకాడ మూడెకరాలున్నది. అక్కడ బోరు కింద మంచిగనే పండుతున్నది. కానీ, ఇక్కడనే నీళ్లందక ఎండే పరిస్థితి వచ్చింది. ఎకురాన ఇరువై వేలదాకా పెట్టిన. మూడెకురాల పెట్టుబడి నష్టపోత గావచ్చని భయమైతంది. గిట్లయితే నా పరిస్థితి దారుణమైతది. ఎకురానికి ఇరువై వేల పెట్టుబడి పోతది. వచ్చే ఇరువై అయిదు వేల లాభం పోతది. చేసి చేసి ఇట్ల నష్టపోవుడంటే చానా బాధైతంది.
– ఉప్పు శ్రీనివాస్, రైతు, రామకిష్టాపూర్, ముత్తారం మండలం