మెట్పల్లి, జూన్ 26 : మక్క రైతులు దగా పడ్డారు. ఆరుగాలం శ్రమించి పండిం చి మక్కలను విక్రయిస్తే.. సదరు వ్యాపారి డబ్బులు చెల్లించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. నాలుగు నెలలైనా చేతికి పైసలు అందకపోవడంతో చివరకు ఠాణా మెట్లెక్కారు. ఇబ్రహీంపట్నం మండలం గోదూ ర్ గ్రామానికి చెందిన పలువురు రైతులు యాసంగిలో సాగు చేసిన మక్కలను మెట్‌పల్లికి చెందిన మహిళా కమీషన్ ఏజెంట్‌కు విక్రయించారు. ఆమె రైతుల నుంచి కొన్న మక్కలను కామారెడ్డికి చెందిన వ్యాపారి విశ్వనాథ పరమేశ్వర్‌కు అమ్మింది. దాంతో ఆ వ్యాపారి మొదట కొందరు రైతులకు డబ్బులు చెల్లించగా, మిగతా 18 మందికి ఇంకా 16 లక్షలు చెల్లించాల్సి ఉన్నది.
మక్కలు అమ్మి నాలు గు నెలలు గడిచినా డబ్బులు చెల్లించకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. ఈక్రమంలో మెట్‌పల్లిలోని కమిషన్ ఏజెంట్‌పై ఒత్తిడి పెంచా రు. దీంతో రెండు నెలల క్రితం ఆ ఏజెంట్ మక్కలు తీసుకు న్న వ్యాపారి నుంచి ప్రామిసరీ నోట్లు, చె క్కులు రాయించి రైతులకు ఇప్పించింది. నెలక్రితం బ్యాంకులో వేసిన చెక్కులు బౌ న్స్ కావడంతో రైతులు ఆగ్రహించారు. మ ళ్లీ డబ్బుల కోసం తిరిగారు. కమీషన్ ఏజెంట్‌పై మళ్లీ ఒత్తిడి పెంచారు. వ్యాపారి స్పందించకపోవడంతో చివరకు ఏజెంట్‌తో కలిసి బుధవారం మెట్పల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని కామారెడ్డికి చెందిన వ్యాపారిపై ఫిర్యాదు చేశారు. నెలలు గడిచి నా డబ్బులు రావడం లేదని, తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.