కరీంనగర్, జూలై 20 (నమస్తే తెలంగాణ) : కరీంనగర్ రూరల్ మండలం గోపాల్‌పూర్‌లో సుమారు 500కుపైగా రైతులు ఉంటారు. కూరగాయల సాగుకు పెట్టింది పేరుగా ఉన్న ఈ గ్రామంలో రైతులు ప్రతీసారి పంట రుణాలు తీసుకుంటారు. క్రమం తప్పకుండా చెల్లిస్తుంటారు. ఎక్కువ మంది దుర్శేడ్ సింగిల్ విండో పరిధిలోని కేడీసీసీ బ్యాంక్‌లోనే పంట రుణాలు, దక్కన్ గ్రామీణ బ్యాంకు, తదితర బ్యాంకుల్లో తక్కువ మంది రుణం తీసుకుంటారు. అయితే, గోపాల్పూర్ సింగిల్ విండో పరిధిలో మొత్తం దుర్షేడ్, గోపాల్పూర్, ఇరుకుల్ల, మొగ్దుంపూర్, చేగుర్తి, నల్లగుంటపల్లి గ్రామాల్లో 800 మంది పంట రుణాలు తీసుకున్న రైతులు ఉన్నారు. ఇందులో రూ.లక్ష రుణం తీసుకున్న వారు 411 మంది ఉన్నారు.
ఇక ఇదే సింగిల్ విండో పరిధిలోని గోపాల్పూర్ విషయానికి వస్తే ఈ ఒక్క గ్రామంలోనే రుణాలు తీసుకున్న రైతులు 225 మంది ఉన్నారు. లక్ష వరకు రుణం తీసుకున్న రైతులు సుమారు 150 మంది ఉంటే వీరిలో కేవలం 26 మందికి మాత్రమే మాఫీ జరిగింది. ఈ గ్రామంలో చాలా మంది చిన్న సన్న కారు రైతులే ఉన్నారు. వీరిలో అర్హతను బట్టి 40 వేల నుంచి 60 వేల వరకు తీసుకున్న రైతులే ఎక్కువగా ఉన్నారు. అయితే, వీరిలో చాలా మంది రుణమాఫీకి అర్హులే. కానీ, జాబితాలో మాత్రం కేవలం 26 మంది పేర్లు మాత్రమే రావడంతో గ్రామంలోని రైతులు గందరగోళంలో పడ్డారు. అసలు మాకు రుణమాఫీ వర్తిస్తుందా? లేదా? అనే మీమాంసలో పడిపోయారు. ఒక ఇంటిలో ఇద్దరి పేర్లపై రుణం తీసుకుంటే కొందరికి వచ్చింది. అనేక మందికి రుణమాఫీ కానేలేదు. దీంతో గ్రామంలో ఎవరెవరికి వచ్చింది? ఎవరికి రాలేదనే విషయమై ఇపుడు ఎక్కడ చూసినా చర్చ జరుగుతున్నది.
.. ఇతని పేరు గోనె నర్సయ్య. గోపాల్‌పూర్‌కు చెందిన ఇతను దుర్షేడ్ సింగిల్ విండో వైస్ చైర్మన్ కూడా. కేడీసీసీబీ నుంచి రెగ్యులర్‌గా రుణం తీసుకుంటారు. క్రమం తప్పకుండా రెన్యువల్ కూడా చేయించుకుంటారు. ఈసారి కూడా తన అర్హతను బట్టి 99 వేల రుణం తీసుకున్నాడు. మాఫీ కోసం ఎదురు చూడకుండా మే నెలలో 3,700 వడ్డీతో కలిపి తీసుకున్న మొత్తం చెల్లించి లోన్ రెన్యూవల్ చేయించుకున్నారు. అయితే, అతను తీసుకున్న 99 వేలకు రెండు నెలల్లో నామ మాత్రపు వడ్డీ మాత్రమే అవుతుంది. అసలు, వడ్డీ కలుపుకుని లక్ష దాటే అవకాశం ఉండదు. కానీ, రుణమాఫీ జాబితాలో పేరు లేక పోవడంతో నర్సయ్యకు నిరాశే మిగిలింది. ఆయనలాగే అనేక మంది రైతుల పేర్లు జాబితాలో రాకపోవడంతో గ్రామంలో ఏ రైతును కదిలించినా తీవ్ర అసంతృప్తే వ్యక్తమైంది.
ధర్మపురి, జూలై 20: ధర్మపురి, జైన, తిమ్మాపూర్ సహకార సంఘాల పరిధిలో 702 మందికి సర్కారు ఎగనామం పెట్టింది. ధర్మపురి సహకార సంఘ పరిధిలో రూ.లక్షలోపు రుణాలు తీసుకున్నవారు 955 మంది ఉండగా, అందులో 544 మందికి మాఫీ జరిగింది. జైన సహకార సంఘ పరిధిలో రూ.లక్షలోపు రుణాల రైతులు 525 మంది ఉండగా, ఇక్కడ 351 మందికి మాత్రమే ఊరట లభించింది. ఇక తిమ్మాపూర్ సంఘ పరిధిలో 402 మందికి 285 మందికి మాత్రమే రుణమాఫీ జరుగడం, మొత్తంగా మూడు సంఘాల్లో మాఫీ కాని 702 మంది రైతులు కలవరపడుతున్నారు. మాఫీ ఉన్నట్టా..? లేనట్టా..? అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
మాది వెల్లుల్ల. ఎవుసం చేసుకుంట బతుకుత. నేను మెట్పల్లి సొసైటీలో 76 వేలు పంట లోను తీసుకున్న. కాంగ్రెస్ ప్రభుత్వం 2లక్షల పంట రుణం మాఫీ చేస్తమని అధికారంలోకి అచ్చింది. మొన్నటి సందే మాఫీ మొదలు పెట్టింది. అయితే ముందు రూ.లక్ష లోపు రైతులకు చేస్తమంటే సంబురపడ్డ. మొదటి దఫాలనే బాకీ తీరుతదని అనుకున్న. కానీ, రూ.లక్షలోపు మాఫీ చేసిన లిస్టులో నా పేరు లేదు. నేనేం పాపం చేసిన. అసలు నా రుణం మాఫీ అయితదా.. కాదా..? ప్రభుత్వమే చెప్పాలి. ఇచ్చిన మాట ప్రకారం నడుచుకోవాలి.
– బంగారు అంజయ్య, వెల్లుల్ల (మెట్పల్లి)
నేను రెండేండ్ల కిందట మంథనిలోని ఎస్బీహెచ్లో 40వేల పంట రుణం తీసుకున్న. ఇదే బ్యాంకులో నా భర్త పేరిట 1.60లక్షల క్రాప్ లోన్ ఉన్నది. అయితే ప్రభుత్వం లక్ష దాకా మాఫీ చేసిందని తెలుసుకుని రుణమాఫీ లిస్ట్ చూసిన. అందులో నా పేరు కనిపించలేదు. ప్రభుత్వం చెప్పేదోకటి చేసేదోకటి. నా లోనే మాఫీ కాలేదు. నా భర్త పేరిట లోన్ మాఫీ అయితదా..?
-తిరుమల, రైతు, రామకిష్టాపూర్, ముత్తారం మండలం (మంథని రూరల్)
మాది రాఘవాపూర్. నా 15 గుంటల ఎవుసం భూమి పాస్‌బుక్‌ను ముత్యంపేట బ్యాంక్‌ల పెట్టి 15 వేల పంట రుణం తీసుకున్న. సర్కారు మొదలు లక్షలోపు రుణం మాఫీ చేస్తమంటే మాఫీ అయిపోతయని సంబురపడ్డ. కానీ, నాపేరు రాలె. పట్టుమని పదిహేను వేల బాకీ కూడా మాఫీ చేయలే. అందరేమో లక్ష లోపు బాకీలు మాఫీ అయినాయి అంటుడ్రు. కానీ, నా అసోంటి పేద మహిళలకు గీ మాఫీ పైసలు రాకపాయే. ఇట్లయితే ఎట్ల? ప్రభుత్వమే నాకు న్యాయం చేయాలె.
– కోరుదెల ఎల్లవ్వ, రైతు, రాఘవపేట (మల్లాపూర్ మండలం)