చొప్పదండి/ గన్నేరువరం/ కరీంనగర్ రూరల్, మే 7: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం వద్ద పడిగాపులు పడుతున్న అన్నదాతలు.. గురువారం సాయంత్రం అకాల వర్షంతో ఆగమాగమయ్యారు. కల్లాల్లో పోసిన ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు అనేక తంటాలు పడ్డారు. చొప్పదండి వ్యవసా మార్కెట్లో ఈదురుగాలులతో తుంపర వర్షం పడగా, ధాన్యం రాసులపై టార్పాలిన్లు కప్పుతూ నానా ఇబ్బందులు పాలయ్యారు. గన్నేరువరం మండల వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం కురువగా, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరి, మక్కలు తడిసిపోయాయి.
కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యం తీసుకువచ్చి 15 రోజులు అవుతున్నా కొనుగోలు చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి కొర్రీలు లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ రూరల్ మండలం నగునూర్, మొగ్దుంపూర్, దుర్శేడ్, చామనపల్లి, జూబ్లినగర్, ఎలభోతారం, చెర్లభూత్కూర్ గ్రామాల్లో ఈదురుగాలలతో ధాన్యంపై కవర్లు కొట్టుకు పోతుండడంతో రైతులు ఆందోళన చెందారు.