Mid Manair Reservoir | బోయినపల్లి రూరల్ : వర్షాభావ పరిస్థితులలో మిడ్ మానేరు జలాశయం నుంచి వెంటనే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మానేరు వారు పరివాహక ప్రాంతాలైన మల్లాపూర్, మాన్వాడ, పొత్తూరు కందికట్కూరు గ్రామాల రైతులు మానేరు (పొత్తూరు) బ్రిడ్జిపై ఆందోళన చేపట్టారు. నీటి విడుదల్లో జరుగుతున్న జాప్యం పై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నంపల్లి పంప్ హౌస్ లు సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మిడ్ మానేరు లోకి నీరు విడుదల చేయకపోవడంతో సాగు పనులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు వాపోయారు.
ఇప్పటికే మానేరు వాగులో వేసిన బోరుబావులు బాయిలను ఆధారం చేసుకొని వేసిన నారుమడులు బోర్లు ఎత్తివేయడంతో ఎండిపోతూ నెర్రలు బారుతున్నాయని, నార్లు ముదిరిపోతున్నాయని, వ్యవసాయ పనులు ప్రశ్నార్థకంగా అవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే జలాశయం నుంచి సాగునీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నీటి విడుదల జరిగే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని రైతులు హెచ్చరించారు.