Farmers | చిగురుమామిడి, సెప్టెంబర్ 26 : రైతులు అన్ని రంగాల్లో ఆర్థిక పురోగతి సాధించాలని సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని సహకార సంఘం అర్థ వార్షిక మహాసభలో చైర్మన్ మాట్లాడుతూ సంఘం పరిధిలో సభ్యులకు రూ.10.18 కోట్లకు పైగా క్రాప్ లోన్, రూ.3.35 కోట్లు దీర్ఘకాలిక, కర్షక మిత్ర లోన్ ఇవ్వడం జరిగిందని అన్నారు.
అర్హులైన సభ్యులందరూ సంస్థలో లోన్ తీసుకొని వారు ఆర్థిక అభివృద్ధి చెందుతూ, సంస్థ అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. గత యాసంగి సీజన్లో సంఘ పరిధిలోని 8 గ్రామాలలో మొత్తం లక్ష క్వింటాళ్లకు పైగా వరి ధాన్యాన్ని రైతుల సహకారంతో కొనుగోలు చేయడం జరిగిందన్నారు. చిగురుమామిడి మండల పరిధిలో స్థలం కేటాయించి గోదాం నిర్మాణానికి సహకరించాలని స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ కు విజ్ఞప్తి చేసారు. చిగురుమామిడి, ఇందుర్తి, రేకొండ సెంటర్ ల ద్వారా రైతులకు ఎరువులను అందించడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో సింగల్ విండో వైస్ చైర్మన్ కరివేద మహేందర్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు తాళ్ళపెల్లి తిరుపతి, కూతురు రవీందర్ రెడ్డి, పోతరవేని శ్రీనివాస్, చాడ శ్రీధర్ రెడ్డి, పేరాల లక్ష్మీ, బండి లక్ష్మి, సంఘ సెక్రెటరీ కాటం నర్సయ్య, సంఘ సిబ్బంది శ్రీనివాస్, కుమారస్వామి, లింగయ్య, పవన్, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. కాగా సమావేశానికి ముందు అర్ధవార్షిక నివేదికను సీఈవో కాటం నర్సయ్య సభలో చదివి వినిపించారు.