ఎల్లారెడ్డిపేట, జూలై 22 : యూరియా కోసం రైతులు గోస పడుతూనే ఉన్నారు. మంగళవారం ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లోని పీఏసీఎస్ గోదాం వద్ద పడిగాపులు కాశారు. నాడు జీలుగ విత్తనాల కోసం ఇబ్బందులు పడితే, ఇప్పుడు నాట్లేసి నెల రోజులైనా యూరియా రాక ఇబ్బందులు పడ్డారు. రెండు రోజుల క్రితం 450 బస్తాలతో యూరియా లోడ్ వచ్చిన విషయం తెలుసుకున్న మూడు గ్రామాల రైతులు బారులు తీరారు. ఒకే లోడు వచ్చిందని, మళ్లీ లోడ్ ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఒక ఎకరానికి ఒక బస్తా ఇవ్వగా, చాలా మంది రైతులకు అందకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. దీనిపై ఏవో రాజశేఖర్‌ను సంప్రదించగా, ఇంకా రెండు లోడ్లు అయితే సరిపోతుందని, ఇండెంట్ పెట్టామని, రెండు రోజుల్లో వస్తుందని తెలిపారు.
నాటేసినంక 15 రోజులలోపే పొలానికి యూరియా ఏత్తెనే పంట మంచిగుంటది. ఇప్పటికే నాట్లేసి నెల రోజులాయె. మా ఊరికి నాలుగు లోడ్ల యూరియా పడ్తది. వచ్చింది ఒకటే లోడు. మళ్లీ వత్తదంటున్నరు. అది అచ్చేదెప్పుడో తెల్వది. సార్లు టైంకు యూరియా ఇస్తెనే రైతుకేమన్న మేలు చేసినోళ్లయితరు.
– సందెవేణి కొమురయ్య, రైతు (వెంకటాపూర్)
నాటేసి నెల రోజులైంది. ఇగ యూరియా ఎప్పుడత్తదని ఎదురు చూసినం. పదిహేను రోజుల కింద వేయాల్సిన యూరియా ఇప్పటికీ వేయలేక పోయినం. ఇప్పుడు గూడా ఒక్కటే లోడు వచ్చిందంటున్నరు. పొద్దుగాలటి నుంచి యూరియా బస్తాల కోసం నిలుచున్న. మళ్లీ లోడు ఎప్పుడత్తదో తెలుత్తలేదు.
– గడ్డం మల్లయ్య, రైతు (వెంకటాపూర్)