UREA | చిగురుమామిడి, ఆగస్టు 24: యూరియా కోసం రైతన్నలు తిప్పలు పడుతున్నారు. మండలంలోని ఇందుర్తి సొసైటీ యూరియా కేంద్రం వద్ద రైతులు శనివారం రాత్రి నుండి పెద్ద ఎత్తున చేరుకొని క్యూలో చెప్పులు పెట్టి పడి కాపులు కాశారు. ఆదివారం తెల్లవారుజామున నుండి సుమారు 800 మందికి పైగా రైతులు కేంద్రానికి చేరుకొని బారులు తీరారు. ఒక్కలోడు 400 బస్తాలకు కాను 800 మందికి పైగా రైతులు బారులు తీరారు. కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు పోటీ పడడంతో నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు చేరుకొని గొడవ జరగకుండా జాగ్రత్తలు చేపట్టారు.
అర్ధరాత్రి నుండి యూరియా కోసం ఉన్న రైతులకు యూరియా ఇవ్వకుండా తెల్లవారుజామున వచ్చిన రైతులకు యూరియా ఇచ్చారని అధికారులు తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలామంది రైతులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెనుదిరిగారు. నాట్లు వేసి నెలకావస్తున్న యూరియా దొరక్క పోవడంతో సాగు చేసిన పంట ఎదుగుదలకు రాకుండా అక్కడే నిలిచిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి యూరియా కొరత లేదని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతులు వాపోయారు.
పదేళ్లలో యూరియాకు ఎప్పుడు లోటు లేదు.. : కాంతాల శ్రీనివాస్ రెడ్డి, రైతు, ఇందుర్తి
బీఆర్ఎస్ పదేళ్ల పానాలలో రైతులకు ఎలాంటి యూరియాకు ఇబ్బందులు ఎదుర్కోలేదు కాంగ్రెస్ రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తానని చేస్తుందని భావించినప్పటికీ ఒరిగిందేమీ లేదు రాత్రి ఒంటిగంటకు 300 మంది రైతుల వరకు లైన్లో ఉన్నాం. తెల్లవారుజామున కొద్ది మంది రైతులకు మాత్రమే యూరియా దొరికింది. అర్హులైన రైతులకు దొరకలేదు. ప్రభుత్వం యూరియా కొరత లేకుండా చూడాలి.