పెద్దపల్లి రూరల్ జూన్ 25: పెద్దపల్లి బైపాస్ రోడ్డు నిర్మాణంతో తాము విలువైన భూములు కోల్పోతున్నామని పెద్దకల్వల రైతులు వాపోయారు. తగిన నష్ట పరిహారం చెల్లించి పనులు చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్రామ శివారులో నూతనంగా నిర్మాణం చేపట్టనున్న బైపాస్ రోడ్డు స్థలం వద్ద నిరసనకు దిగారు.
పెద్దకల్వల నుంచి అప్పన్నపేట వరకు నిర్మిస్తున్న పెద్దపల్లి బైపాస్‌రోడ్డులో పోతున్న భూములకు తగిన నష్టపరిహారం చెల్లించి పనులు చేసుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. కొందరికి ఉన్న కొద్దిపాటి సాగు భూమి నుంచి రోడ్డు పోతుండడంతో వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉందని వాపోయారు. అలాంటి వారి విషయంలో అధికారులు, ప్రభుత్వం ఆలోచించి న్యాయం జరిగేలా చూడాలని కోరారు.