కోనరావుపేట, జూలై 27 : రైతులకు పారదర్శకంగా ఎరువులు అందించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ బుకింగ్ విధానం అధ్వానంగా మారింది. యాప్‌లో యూరియా బుక్ అయి, టోకెన్ తీసుకున్న తర్వాత బస్తాలు తీసుకోకుండానే తీసుకున్నట్టుగా చూపించడంతో సోమవారం కోనరావుపేట మండలం ధర్మారం రైతులు కొమ్మిటి తిరుపతిరెడ్డి, పొన్నం పర్శరాములు, మల్లెబోయిన ముత్తయ్య, మల్లెబోయిన లక్ష్మితో పాటు పలువురు నిరసనకు దిగారు. వారు మాట్లాడుతూ యాప్‌లో ఈ నెల 13న యూరియా కోసం బుక్ చేసుకున్నామని, యాప్‌లో కొలనూర్ సింగిల్ విండో సొసైటీలో బస్తాలు ఉన్నాయని చూపించడంతో సంబంధిత టోకెన్ నంబర్లతో 14న వెళ్లినట్టు చెప్పారు. అయితే యూరియా స్టాక్ లేదని అధికారులు చెప్పడంతో ఇంటికి వచ్చామని, తిరిగి సోమవారం యూరియా ఉందని తెలిసి సింగిల్ విండో సొసైటీకి వెళ్లామని చెప్పారు. అయితే ‘యూరియా తీసుకున్నట్టు ఆన్లైన్లో చూపిస్తుందని డీలర్లు చెప్పగా, రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సొసైటీ సీఈవో రాజేశంను ‘మా బస్తాలు ఎవంటూ నిలదీస్తే తనకు తెలియదంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెపుతున్నారని రైతులు పేర్కొన్నారు. తమ పేరుపై యూరియా బుక్ అయినట్లు రికార్డుల్లో కనిపిస్తున్నదని, తమకు ఒక బస్తా ఇవ్వకుండా తీసుకున్నట్టు ఎలా చూపిస్తుందని, ఆ బస్తాలు ఎవరికి అమ్ముకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులు వెంటనే విచారణ జరిపి, బుక్ చేసుకున్న యూరియా బస్తాలు అందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
నేను మూడున్నరెకురాల భూమిలో వరి వేసిన. ఈసారి వర్షాలు తక్కువగా పడుతున్నాయని ముందుగానే నాటు వేసిన. నా స్మార్ట్ ఫోన్లోని ఆప్‌లో నాలుగు యూరియా బస్తాలను బుక్ చేసిన. కొలనూర్ సింగిల్ విండోలో స్టాక్ ఉన్నట్లు చూపిస్తే అక్కడికి వెళ్లి అడిగిన. ఇక్కడ స్టాక్ లేదని సుద్దాల గోదాంకు వెళ్లమని చెప్పిన్రు. వెంటనే అక్కడికి వెళ్లి బుక్ అయిన బస్తాల టోకెన్ చూపించిన. మీరు యూరియా తీసుకున్నట్టు ఆప్‌లో కనిపిస్తుందని, మళ్లీ ఇవ్వలేమని అన్నరు. సింగిల్ విండో అధికారులను అడిగితే మాకేం తెలియంటున్నరు. నా యూరియా ఎటు పోయిందో చెప్పాలి. ఇప్పించాలె.