Palakurti | పాలకుర్తి : మండలం ఈసాల తక్కలపల్లి గ్రామ రైతులు సాగునీటి కోసం నానాతిప్పలు పడుతున్నారు. గ్రామంలో పంటలు చివరి దశకు రావడంతో పెద్ద చెరువు కింద ఆయకట్టు పొలాలకు సాగునీటి అందించేందుకు రైతులు నానా కష్టాలు పడుతున్నారు. గతవారం చెరువులో ఉన్నటువంటి అడుగు నీటిని జేసీబీతో కాలువలు తీసి నీరు సరఫరా కోసం ఏర్పాటు చేసుకున్నారు.
కానీ ఇప్పుడు మళ్ళీ నీటి ఇబ్బందులు రావడంతో ఈసాల తక్కళ్లపల్లి గ్రామం పైన ఉన్నటువంటి కొత్తపెల్లి ఎరుకల కుంట నుంచి సాగునీరు సరఫరా కు కాలువను రైతులే స్వయంగా జేసీబీతో పూటిక మట్టి తొలగించుకొని నీటిని మల్లించుకుంటున్నారు. రైతులకు పంట చివరి దశకు వచ్చేసరికి, ఈసాలతక్కళ్లపెల్లి పెద్ద చెరువులో నీరు అడుగంటడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువ నుంచి ఈసారి తక్కలపల్లి పెద్ద చెరువులోకి సాగునీరుకై శ్రీరాంసాగర్ ప్రాజెక్టు అధికారులు శ్రద్ధ చూపెట్టకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. చెరువులో నీరు లేక పంటలకు సాగునీరు అందడం లేదని రైతులు వాపోతున్నారు. రైతులు పడుతున్న నానా తిప్పలను గమనించి అయినా అధికారులు దృష్టి సారించి ఈసాలతక్కళ్లపల్లి పెద్ద చెరువులోకి శ్రీరాంసాగర్ కాలువ నీటిని సరఫరా అయ్యేట్లు చూడాలని కోరుతున్నారు.