కోనరావుపేట, ఏప్రిల్ 15 : చెరువులో మునిగిపోయే పట్టా భూములకు తగిన నష్టపరిహారం అందించడంతోపాటు జీవనాధారం చూపించి తమను ఆదుకోవాలని మల్కపేట రైతులు వేడుకున్నారు. మంగళవారం కోనరావుపేట మండలంలోని మల్కపేట రిజర్వాయర్ ప్యాకేజ్-9లో భాగంగా నిర్మిస్తున్న కుడికాలువ పనులను అడ్డుకున్నారు. తమకు పరిహారం అందించిన తర్వాతే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. దీంతో అధికారులు పోలీసుల బలగాలను దించి పనులను కొనసాగించారు.
వివరాల్లోకి వెళితే.. మల్కపేట రిజర్వాయర్ కుడికాలువ పనులు పూర్తి చేసి చెరువులు, కుంటలు నింపే విధంగా అధికారులు మిగిలిన కాలువ పనులు చేపట్టారు. ఈ క్రమంలో కాలువ ద్వారా మల్కపేట ఊర చెరువు నింపితే సుమారు 50 మంది రైతులుకు ఉన్న 40 ఎకరాల భూములు నీటి మునిగిపోతాయని అందోళన చెందుతున్నారు. భూములు మునిగిపోతే పంట వేయడానికి అవకాశం లేదని ప్రత్యామ్నాయం చూపించందే పనులు నిర్వహించవద్దని కోరుతున్నారు. ఇప్పటికే అధికారులకు సమస్యను విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
దీంతో మంగళవారం రైతులు పనులను అడ్డుకోగా ప్రాజెక్టు అధికారులు వారితో మాట్లాడారు. చెరువుల్లో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించేందుకు వీలు లేదని, రైతులు భూములు నష్టపోకుండా కాలువ దగ్గర గేట్ ఏర్పాటు చేస్తామని అధికారులు సూచించారు. అయినా, వినకపోవడంతో పోలీసు బలగాలను దించి, పనులు నిర్వహిస్తున్నారు. ఈ విషయమై ఈఈ కిశోర్‌ను ఫోన్లో వివరణ కోరగా చెరువులలో భూములు కోల్పోయిన ఎక్కడ కూడా నష్టపరిహారం అందించలేదని చెప్పారు. సుమారు 200 మీటర్ల పనులు పూర్తయితే కుడి కాలువ ద్వారా చెరువులు, కుంటలు నిండి రైతులకు సాగునీరందనుందని పేర్కొన్నారు. రైతులు సహకరించి సజావుగా పనులు సాగిలే చూడాలని కోరారు.