ఎల్లారెడ్డిపేట, సెప్టెంబర్ 4: యూరియా కోసం రోజుల తరబడి ఎదురు చూస్తున్న రైతులు వచ్చిన లారీ లోడులో సగమే దింపుతామని అధికారులు చెప్పడంతో ఆగ్రహించారు. మొత్తం లోడు దించాల్సిందేనని పట్టుబట్టారు. గురువారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కేశవపెరుమాళ్ల స్వామి గుట్ట వద్ద ఉన్న ఐకేపీ గోదాంకు యూరియా వచ్చిందని తెలిసి రైతులు ఉదయం 6.30 గంటలకే చేరుకున్నారు. మండల కేంద్రంతోపాటు నారాయణపూర్, రాగట్లపల్లి, కోరుట్లపేటకు చెందిన సుమారు 400మంది రైతులు తరలివచ్చారు.
తమకు యూరియా బస్తాలు చాలవని మండల కేంద్రానికి చెందిన రైతులు హైరానా పడ్డారు. తమ గ్రామానికి చెందిన రైతులకే ఇవ్వాలని, ఇతర గ్రామాల వారు రావొద్దని కొద్ది సేపు ఒకరికొకరు వాగ్వాదానికి దిగారు. దీంతో రాగట్లపల్లికి చెందిన రైతులు కల్పించుకుని ఇప్పటి వరకు తమ గ్రామానికి యూరియా బస్తాల లారే రాలేదని, తాము ఎక్కడికెళ్లి తెచ్చుకోవాలని ఆవేదనగా మాట్లాడారు. దాంతో కొందరు రైతులు కల్పించుకుని అందరం రైతులమేనని, ఎక్కువ లోడు తేవాలని డిమాండ్ చేద్దామని చెప్పారు.
అప్పటికే అక్కడకు వచ్చిన లారీలో 440 బస్తాల లోడును దించాల్సిందేనని పట్టుబట్టారు. 220 బస్తాలు హామాలీలు గోదాంలో దింపగా, మిగతా లోడు కావాలని లారీని అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. కొద్ది సేపు లారీకి అడ్డంగా కూర్చుని నిరసన తెలిపారు. చివరకు పోలీసులు, అధికారులు శుక్ర, శనివారాల్లో మరో లోడు వస్తుందని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. 220 బస్తాలు కూడా పంపిణీ చేయవద్దని, మిగతా లోడు వచ్చిన తర్వాతనే కలిపి పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేయడంతో గురువారం పంపిణీ నిలిపి వేశారు.