కరీంనగర్రూరల్, జనవరి 3 : కరెంటోళ్ల పుణ్యమా.. అని రైతులు నాటేసేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం యాసంగి నాట్లు ఊపందుకున్న తరుణంలో పొలం దున్నేందుకు నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. కరీంనగర్ మండలం మొగ్దుంపూర్కు చెందిన పూరెల్లి అంజయ్య తన నాలుగెకరాల పొలం వేసేందుకు 25 మంది బిహార్ కూలీలను ఒక్కొక్కరికి 500 చొప్పున మాట్లాడుకున్నాడు.
నాటేసే ముందు పొలం దున్నడానికి నీళ్లు పెట్టాల్సి ఉండగా, శుక్రవారం తెల్లవారుజామున నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కరెంటు లేకపోవడంతో ఇబ్బంది పడ్డాడు. పొలంలో నీళ్లు లేకపోవడంతో దున్నడం ఆగిపోగా, నాటు వేయాల్సిన కూలీలు ఇలా ఖాళీగా ఉండాల్సి వచ్చింది. 12 గంటల తర్వాత కరెంటు వచ్చినా నీళ్లు పెట్టి, దున్నేసరికి సాయంత్రం కావడంతో నాటు వేయడం వీలు కాలేదు. ఫలితంగా రైతు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. ఇలా గ్రామాల్లో చాలా మంది రైతులు నిత్యం అవస్థలు పడుతున్నారు.