రైతులు యూరియా కోసం గోస పడుతూనే ఉన్నారు. ఏ కేంద్రానికి లోడ్ వచ్చిందని తెలిసినా.. అక్కడికి పరుగులు తీస్తున్నారు. పొద్దంతా పడిగాపులు గాసినా దొరకక నిరాశ చెందుతున్నారు. ఆదివారం కూడా ఉమ్మడి జిల్లా రైతులు అరిగోస పడ్డారు. గంటల తరబడి లైన్లలో ఉన్నా అందరిక నిరాశతో వెళ్లిపోయారు.
ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 17 : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గోదాంకు అల్మాస్పూర్తో పాటు అక్కపల్లి, బుగ్గరాజేశ్వరతండా, రాజన్నపేటకు చెందిన రైతులు ఆదివారం ఉదయం 5గంటలకే పెద్ద సంఖ్యలో వచ్చారు. 5.30గంటలకు వరకు చెప్పులు క్యూలో ఉంచారు. తర్వాత సిబ్బంది చెప్పులను క్యూలో నుంచి తీయించి, రైతులకు టోకెన్లు ఇచ్చారు. మొత్తం 330 బస్తాలే యూరియా ఉండగా, 6గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఒక్కొక్కరికి ఒక్కో బస్తా అందజేశారు. వచ్చిన సుమారు 500 మంది రైతుల్లో చాలా మందికి బస్తాలు అందక నిరాశతో వెనుదిరిగారు.
చిగురుమామిడి, ఆగస్టు 17 : చిగురుమామిడి మండలం రేకొండ సహకార సంఘం కేంగ్రానికి 230 యూరియా బ్యాగులు రాగా, వంద మందికిపైగా రైతులు ఉదయాన్నే తరలివచ్చారు. 7గంటల నుంచే పంపిణీ ప్రారంభించి ఒక్కొక్కరికి రెండు చొప్పున అందజేశారు. అయితే కొందరికి అందకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. బీఆర్ఎస్ పాలనలో యూరియా కోసం ఇబ్బంది పడలేదని, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో గోస పడుతున్నామని వాపోయారు.
ఇల్లంతకుంట, ఆగస్టు 17 : రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామంలోని అవని గ్రామైక్య మహిళా సంఘం యూరియా విక్రయ కేంద్రం వద్ద రైతులు ఆదివారం పడిగాపులు గాశారు. 150 మందికిపైగా రాగా, వంద బ్యాగులే పంపిణీ చేశారు. దీంతో మిగతా రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సాగు పనులు వదులుకొని వచ్చినా యూరియా అందడం లేదని వాపోయారు.