కోనరావుపేట, ఏప్రిల్ 8: కోనరావుపేట మండలం వెంకట్రావుపేట, బావుసాయిపేట మధ్య మూలవాగులో ప్రభుత్వం చెక్ డ్యాం నిర్మిస్తున్నది. చెక్ డ్యాం వద్ద ఉన్న ఇసుకను, సమీపంలో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ నుంచి కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్టు, మర్రిపల్లి ప్రాజెక్టుకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో చెక్ డ్యాం వద్ద బ్యాక్ వాటర్ నిలిచి మూలవాగును ఆనుకొని ఉన్న సుమారు 70 మంది చిన్నసన్నకారు రైతులకు సంబంధించిన 60 ఎకరాల భూమి కోతకు గురవుతుందని ఆందోళన చెందుతున్నారు.
భూమి కోతకు గురికాకుండా సైడ్ వాల్స్‌ను రాతితో కట్టాలని, లేదంటే ఇసుక రీచ్ నిలిపివేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం మూలవాగులో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌ను రైతులు అడ్డుకున్నారు. ఉదయాన్నే పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకొని, ఇసుక తోడుతున్న ఎక్స్కవేటర్, టిప్పర్లను నిలిపివేసి నిరసన తెలిపారు.
ఇసుక తీయడం వల్ల భూములు ఎక్కువ శాతం కోతకు గురవుతాయని, భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోతాయని వాపోయారు. ఇప్పటికే ఈ ఏడాది బోరుబావులు ఎత్తిపోవడంతో పొలాలు పూర్తిగా ఎండిపోయాయని ఆవేదన చెందారు. ఇసుక రీచ్‌ను ఇక్కడి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సాగు భూముల చుట్టూ సైడ్ వాల్ నిర్మించకుండా చెక్‌డ్యాం కోసం ఇసుక తీస్తే ఊరుకోనేది లేదని హెచ్చరించారు. అయినా బావుసాయిపేట రీచ్ నుంచి కలికోట సూరమ్మ చెరువు, మర్రిపల్లి, తదితర ప్రాంతాలకు ఇసుకను తరలించడమేంటని ప్రశ్నించారు.
కొందరు రాత్రింబవళ్లు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని మండిపడ్డారు. వారిపై అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోకుండా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నాని, దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన చెందారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టపోకుండా చూడాలని కోరుతున్నారు. అడ్డుకున్న విషయం తెలిసిన వెంటనే తహసీల్దార్ వరలక్ష్మి, ఎస్ఐ ప్రశాంత్‌రెడ్డి, పోలీసులు, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకున్నారు. రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. నష్టం జరగకుండా ఉన్నతాధికారుల దృష్టికి తీసువెళ్లి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మాకు మూలవాగును ఆనుకొని ఎకరంన్నర పొలం ఉంది. వాగు నుంచి బోరు ఉంది. రెండు నెలల నుంచి ఇసుక తీస్తుండడంతో బోరులో నీళ్లు అడుగంటినయి. నీళ్లు లేక పంట ఎండిపోతంది. అధికారులు ఇక్కడి నుంచి ఇసుకను తీసుకుకోపోవడమే తప్ప రైతుల ఆవేదన పట్టించుంటలేరు. వాగును ఆనుకొని చుట్టూ రాతితో సైడ్‌వాల్స్ కట్టకుండా మట్టి పోస్తున్నరు. ఇప్పటికే ఇసుక తీయడంతో భూమి కోతకు గురైంది. కలెక్టర్ స్పందించి రైతులకు నష్టం జరగకుండా చూడాలి.
-పుల్లూరి లత, మహిళా రైతు,(బావుసాయిపేట)
మూలవాగులో ఇసుక రీచ్ ఏర్పాటు చేయడంతో బోర్ల చుక్క నీరు లేక పొలాలు ఎండిపోతున్నయి. భూగర్భ జలాలు అడుగంటి పోయి చివరి దశలో చాలా నష్టపోతున్నం. పెట్టుబడి మీద పడెటట్టున్నది. అధికారులు ఇసుక రీచ్‌ను తొలగించాలి. చెక్ డ్యాం దగ్గర ఉన్న భూములు కోత పడకుండా రాతితో కట్టలు కట్టాలి. మట్టిపోసి ఉంచితే మూలవాగులో వరద ఎక్కువ వచ్చినప్పుడు భూములు కోసుకపోతయ్. అధికారులు చొరవ చూపి నష్టం కలుగకుండా పనులు చేయాలి.
– గెంటె లక్ష్మి, మహిళా రైతు, (బావుసాయిపేట)