రుణమాఫీ కథ నడుస్తూనే ఉన్నది. ఊరికో వ్యథ.. ఒడువని ముచ్చటలా సాగుతున్నది. కాంగ్రెస్ సర్కారు పాపం.. రైతులకు శాపంలా మారింది. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీని సంపూర్ణంగా అమలు చేశామని ప్రభుత్వ పెద్దలు గొప్పలకు పోతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం బాధితుల లెక్క బయటికొస్తున్నది. ఎంతమందికి ఎగనామం పెట్టిందో లెక్క తేలుతున్నది. అందుకు కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామమే నిదర్శనంగా నిలుస్తున్నది. 600 మంది లోన్ తీసుకుంటే సవాలక్ష కొర్రీలు పెట్టి దాదాపు 400 మందికి మొండిచెయ్యి చూపింది. ఇక్కడి ఇండియన్ బ్యాంకులో లోన్ తీసుకున్న ఏడు గ్రామాల్లోని రైతుల పరిస్థితి ఇదే. 1338 మందిలో కేవలం 208 మందికే మాఫీ చేసి దాదాపు 1138 మందికి ఎగనామం పెట్టడం ధోఖాకు అద్దంపడుతున్నది.
జగిత్యాల, ఆగస్టు 21, (నమస్తే తెలంగాణ)/జగిత్యాల టౌన్/కోరుట్ల రూరల్: ‘ఇదేం రుణమాఫీ? ఇదేం కథ? అంతా ఫాల్తు ముచ్చట’ అంటూ కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామ రైతులు ఆగ్రహిస్తున్నారు. గ్రామంలో వందలాది మందికి మాఫీ కాకపోవడంతో ప్రభుత్వ చర్యపై, అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. పైడిమడుగు పూర్తిగా వ్యవసాయాధారిత గ్రామం.
దాదాపు 900 మంది రైతులు ఉండగా, గ్రామంలో ఇండియన్ బ్యాంక్ ఉన్నది. అలాగే సింగిల్ విండో బ్యాంకు సైతం నడుస్తుంది. పైడిమడుగు ఇండియన్ బ్యాంకు పరిధిలో పైడిమడుగుతోపాటు మాదాపూర్, రామారావుపల్లి, చర్లకొండాపూర్, రాయికల్ మండలం మైతాపూర్ తదితర గ్రామాల రైతులకు ఖాతాలు ఉన్నాయి. ఇండియన్ బ్యాంకు పరిధిలో మొత్తం 1,338 మంది పంట రుణాలను తీసుకున్నారు.
అందులో లక్ష రూపాయల లోపు రుణం పొందిన వారు 800 మంది, లక్షన్నర లోపు రుణం పొందిన వారు 238 మంది, 2లక్షల రుణం పొందిన వారు 300 మంది ఉండగా, మొత్తంగా 208 మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది. లక్ష లోపు రుణం ఉన్న వారికి ఎవరికి రుణమాఫీ జరగలేదు. లక్షన్నర రుణం పొందిన వారిలో 170 మందికి, 2లక్షల లోపు రుణమాఫీ కేవలం 38 మందికి మాత్రమే జరిగింది. మొత్తంగా 208 మందికి రుణమాఫీ జరుగగా, 1130 మంది మాఫీకి నోచుకోలేదు. మాఫీ 15శాతానికి దాటలేదు.
ఇక పైడిమడుగు పీఏసీఎస్ పరిధిలో దాదాపు 600 మంది రైతులు పంట రుణం పొందగా, 400 మందికి రుణమాఫీ జరుగకపోవడంతో పైడిమడుగు గ్రామ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ‘నమస్తే తెలంగాణ’ పైడిమడుగులో ఫీల్డ్ విజిట్ చేయగా, విషయం తెలుసుకున్న రైతులు పెద్ద సంఖ్యలో వచ్చి తమ పేర్లు రాయాలని కోరడం, అలాగే పైడిమడుగు పక్కనే ఉన్న చిన్నమెట్పల్లి, మాదాపూర్ గ్రామాలకు చెందిన రైతులు సైతం తమ పేర్లు ప్రచురించాలంటూ వచ్చారు. సర్కారు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు రైతుల మాటల్లోనే..
ముగ్గురు ఆడపిల్లలు ఎలా బతికేది?
మాది చిన్నమెట్పల్లి. నా భార్య పద్మ. నేను ఇద్దరం రైతులమే. ఉన్న కొద్దిపాటి భూమిని సాగు చేసుకుంట ముగ్గురు ఆడపిల్లలను పోషించుకుంటున్న. ఉన్న భూమి మీద 1.40 లక్షల లోన్ ఇండియన్ బ్యాంకుల తీసుకున్న. రెండో దఫాలో మాఫీ కాలేదు. ఎందుకు కాలేదంటే మూడో దఫాలో అయితదన్నరు. మూడో లిస్టులో నా పేరు లేదు. ఏమైందంటే చెప్పరు. పోని నేను వడ్డీ కట్టలేదా..? అంటే కట్టిన. డిసెంబర్ 9 నాటికి నేను కేవలం 1,38,303 బాకీ ఉన్న అని చెబుతున్నరు. మరి ఎందుకు మాఫీ కాలేదు అంటే సప్పుడు లేదు.
– వొల్లెం కొమురయ్య, చిన్నమెట్పల్లి
ఎందుకు రాలేదో తెలువదట
చిన్నమెట్‌పల్లిలో ఆరెకరాల వ్యవసాయం ఉంది. నేను నా భార్య, ఇద్దరం ఎవుసం చేసుకొనే బతుకుతం. అది తప్ప మాకు ఇంకోటి తెలువదు. పైడిమడుగు ఇండియన్ బ్యాంకులో ఖాతా ఉంది. నాలుగేండ్ల కింద బ్యాంకులో పంట కోసం 1.60 లక్షలు లోన్ తీసుకున్న. క్రమం తప్పకుండా లోన్ కడుతున్న. ఏడాది ఏడాదికి రెన్యువల్ చేసుకుంటున్న. కానీ నా లోన్ మాఫీ కాలేదు. ఎందుకు కాలేదంటే ఎవరూ చెబుతలేరు. బ్యాంకు అధికారులే తప్పు చేసినట్లు అనిపిస్తున్నది. ప్రతి ఏడాది రెన్యువల్ చేసుకున్న తేదీనే లోన్ తీసుకున్న తేదీగా చూపాలే. కానీ, బ్యాంకు అధికారులు అలా కాకుండా రైతులు ఫస్ట్ లోన్ తీసుకున్న తేదీని చూపడంతో రుణమాఫీ జరుగలేదనిపిస్తంది. నాకు న్యాయం చేయాలి.
– నాగులపల్లి హన్మాండ్లు, చిన్నమెట్పల్లి
కేసీఆర్ రెండుసార్లు మాఫీ చేసిండు
కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి ఉండంగ నాకు రెండు సార్లు మాఫీ అయ్యింది. ఇప్పుడు అయిత లేదంటున్నరు. ఏందో తెలువదు. నాకు ఇద్దరు కొడుకులు. పెద్దవాళ్లే పెండ్లిండ్లు అయినయి. వాళ్లది వాళ్లు ఉంటున్రు. నాది నేను ఉంటున్న. ఆడమనిషినే అయినా నాకు ఎవుసం చేసుడు ఇష్టం. ఇప్పటికీ చేస్తూనే ఉన్న. నాకు 34 గుంటల భూమి ఉన్నది. దీన్ని పొలం చేస్తున్న. నేను ఇండియన్ బ్యాంకుల మునుపు రెండుసార్లు లోన్ తీసుకున్న. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంక మొదటి సారి 28వేలు, రెండోతాప 38వేలు మాఫీ చేసిండు. ఏడాది కింద మళ్లీ 35వేలు అప్పు తీసుకున్న. అవి మాఫీ కాలేదు. మస్తు సార్లు బ్యాంకుకు పోయి అడిగిన నాకు కాలేదన్నరు. సీఎం రేవంతం సార్ గిట్ల చేసుడు అన్యాయం. ముసలోళ్లను తిప్పితిప్పి సంపుడు ఏందో అర్థమైతలేదు. ఇత్తే ఇయ్యాలే. లేకుంటే లేదు. ఇత్తున్న అని చెప్పి ఎగవెట్టుడు మంచిగ లేదు.
– వాసాల వెంకటరాజు, పైడిమడుగు
అడిగితే చెప్పటోళ్లు లేరు
నాకు ఉన్నది 35 గుంటల భూమి. దాన్ని నమ్ముకొనే బతుకుతన్నం. ఇండియన్ బ్యాంకులో మూడేండ్ల కింద 35వేల లోన్ తీసుకున్న. ఈదు గీసినట్లు నెలనెలా మిత్తి కట్టిన. నెలనెలా వడ్డీ మాత్రం తప్పకుండా కడుతూనే వచ్చిన. అట్లనే ప్రతి ఏడు జూన్‌లో రెన్యువల్ చేసుకుంటూనే ఉన్న. నా 35వేల లోన్ ఫస్ట్ తాపకే మాఫీ కావాలే. బ్యాంకుకు పోయి అడిగితే తెలువదు అని చెప్పిన్రు. రెండోసారి అయితదన్నరు. అప్పుడూ కాలే. ఇప్పుడు మూడోసారి మాఫీ కాలె. ఇంతకంటే అన్యాయం మరొకటి లేదు. అసలు ఎందుకు మాఫీ కాలేదు అని అడిగితే చెప్పటోళ్లు లేరు.
– నాగిరెడ్డి దశరథం. పైడిమడుగు
ఉత్త ముచ్చట.. గిట్ల చేస్తరా సార్
నాకు ఊళ్లే నాలుగెకరాల ఎవుసం ఉన్నది. నేను, నా భర్త చిన్న రాజేశం ఇద్దరం ఎవుసం చేసే బతుకుతం. మా ఇద్దరు కొడుకులు పెద్దోళ్లు అయ్యిన్రు. వాళ్లది వాల్లే. మాది మేమే జేసుకుంటున్నం. ఎకరంన్నర మక్క ఏసినం. మిగిలింది పొలం చేస్తున్నం. 2018లో ఇండియన్ బ్యాంకులో 85వేల లోన్ తీసుకున్న. ఆ పైసలు మాఫీ కాలేదు. చానా రోజుల సంది తిరుగుతున్నం. కాలేదంటున్రు. బ్యాంకుకు పోతే వ్యవసాయ అధికారికి దగ్గరకు పొమ్మంటరు. అడికి పోతే బ్యాంకుకు పోమ్మంటరు. ఏం తెలుస్తలేదు. లోన్ మాఫీ అంతా ఉత్త ముచ్చట. గిట్ల ప్రజలను మోసం చేయడం కరెక్ట్ కాదు సార్.
– సంగని లక్ష్మి, పైడిమడుగు
తిరిగి తిరిగి రేగాళ్లు పడుతున్నయి.
నాకు పైడిమడుగులో ఉన్నదే 25 గుంటల భూమి. ఇండియన్ బ్యాంకులో 25వేల అప్పు తీసుకున్న. మిత్తి కట్టుకుంటనే అచ్చిన. నాకు లోన్ మాఫీ కాలేదు. ఫస్ట్, ఫస్టే అయితది అన్నరు. కాలేదు. రెండోసారి, మూడోసారి అని సమాధానం దాటిచ్చిన్రు. నాకు రుణమాఫీ ఎందుకు రాలేదో తెలువదు. బ్యాంకుకు, వ్యవసాయ ఆఫీస్ చుట్టు తిరిగి తిరిగి రేగాళ్లు పడుతున్నాయి.
– ఆసిరెడ్డి నర్సారెడ్డి, పైడిమడుగు
నాకెందుకు రాలేదో
నాకు నాలుగెకరాల భూమి ఉంది. పసుపు, మక్క, వరి వేస్త. ఇద్దరం భార్యాభార్తలం రైతులమే. నాకు కేసీఆర్ చేసినప్పుడు 2023 అక్టోబర్ నెలలో లక్ష లోన్ మాఫీ అయ్యింది. మళ్ల అదే లోన్‌ను రెన్యువల్ చేసుకున్న. మీకు నాలుగెకరాల భూమి ఉంది కదా..? 2లక్షలు తీసుకోమని ఇండియన్ బ్యాంకు సార్లు అంటే అక్టోబర్ 29న తీసుకున్న. ప్రతి నెలా మిత్తి కడుతూనే ఉన్న. నాకు రెండు లక్షలు రుణమాఫీ కాలేదు. ఎందుకో అర్థమైతలేదు. డిసెంబర్ 9 లోపల తీసుకున్నవాళ్లకు వస్తదన్నరు. మరి నాకెందుకు రాలేదో తెల్వదు.
– నేమిండ్ల మల్లారెడ్డి, పైడిమడుగు
తిప్పించుకునుడు మంచిదికాదు
నాకు పైడిమడుగులో రెండున్నర ఎకరాల భూమి ఉంది. పొలం, మక్క వేసుకొని బతుకుతున్న. పైడిమడుగు కో ఆపరేటివ్ బ్యాంకులో నాకు ఖాతా ఉంది. ఈ యేడాది నవంబర్‌లో పంట కోసం 1.70 లక్షలు లోన్ తీసుకున్న. నాకు రుణమాఫీ కాలేదు. ఎందుకు కాలేదంటే ఎవ్వరు సప్పుడు చేత్తలేరు. బ్యాంకుకు వెళ్లి అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదు. వ్యవసాయ అధికారులను కలువమంటున్నారు. వారిని కలిస్తే బ్యాంకులో అడుగుమంటున్నరు. ఏ ముచ్చట సక్కగ చెప్పడం లేదు. గిట్ల మమ్ముల తిప్పించుకునుడు మంచిదికాదు.
– దుంపల ప్రదీప్, పైడిమడుగు
నాశనమైపోతరు
మాది చిన్నమెట్పల్లి. రెండు ఎకరాల భూమి ఉంది. నా భర్త పేరు జగదీశ్వర్. మాకున్న కొద్దిపాటి భూమిని నమ్ముకొనే ఇద్దరు పిల్లలు, కుటుంబం అంతా బతుకుతున్నం. పంట రుణం మాఫీ చేస్తమంటే నమ్మితిమి. ఇప్పుడు గిట్ల చేసుడు మంచిది కాదు. డిసెంబర్ 9వ తేదీ నాటికి నాకు 99,564 వేల లోన్ ఇండియన్ బ్యాంకులో ఉన్నది. ఫస్ట్ లిస్టులో మాఫీ కాలేదు. రెండోదాంట్లో కాలేదు. మూడో దాంట్లోను పేరు లేదు. గిట్ల అయితే ఎట్ల. మాలాంటి చిన్నోళ్లను మోసం చేసేటోళ్లు నాశనమైపోతరు.
– దువ్వాక పద్మ. చిన్నమెట్పల్లి