ఎల్లారెడ్డిపేట, మార్చి 13: భూగర్భజలాలు అడుగంటిపోవడం.. బోరుబావులన్నీ ఎత్తేయడంతో పొట్టదశకు వచ్చిన వరి ఎండిపోతున్నది. పంటను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నం చేయాల్సి వస్తున్నది. ఈ పరిస్థితుల్లో బోర్లు వేస్తున్నా చుక్కనీరు రాక రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. కండ్లముందే పంట ఎండిపోవడంతో చేసేదేమీ లేక లక్షల్లో పెట్టుబడి పెట్టిన సాగు చేసిన పంటలను వేల రూపాయలకే జీవాల మేతకు అప్పగిస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన వడ్నాల లచ్చయ్యది ఇదే దుస్థితి. ధర్మాజీ చెరువు సమీపంలో తన ఆరెకరాల వ్యవసాయ భూమిలో వరి సాగు చేశాడు.
పదిహేను రోజుల క్రితం గతంలో ఉన్న మూడు బోర్లు ఎత్తేయగా, మరో 2లక్షల అప్పు చేసి వారం రోజుల్లో మూడు బోర్లు వేయించాడు. అయినా చుక్క నీరు పడలేదు. ప్రస్తుతం ఆరెకరాలకు పొలానికి కేవలం 15గుంటలు మాత్రమే పారుతున్నది. మిగతా 5.25ఎకరాల పొలం ఎండిపోవడంతో చేసేదేమీలేక జీవాల మేత కోసం గొర్రెల కాపరులకు 12వేలకు ఇచ్చాడు. మూడు బోరుబావులు వేసేందుకు 2లక్షలు కాగా, పెట్టుబడి కోసం మరో 2లక్షల వరకు ఖర్చయిందని సదరు రైతు వాపోతున్నాడు. వ్యవసాయమంటే ఇష్టం ఉన్నందునే భూమిపై ఇప్పటికే 13 లక్షలు అప్పు చేశానని చెప్పాడు. పరిస్థితి ఇలా ఉంటే పెట్టుబడులు ఎలా వస్తాయని ఆవేదనగా చెబుతున్నాడు.