జగిత్యాల(నమస్తే తెలంగాణ)/ ధర్మపురి జూలై 18 : ధర్మపురి రైతుల ఎన్నో ఏండ్ల కల అయిన అక్కెపెల్లి చెరువుకు ఎత్తిపోతల పథకం పనులు వెంటనే ప్రారంభించాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. ఇవి పూర్తయితే 5వేల ఎకరాలకు సాగునీరందుతుందని చెప్పారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పనులు సాగడం లేదని ఆగ్రహించారు. రాష్ట్రంలో పంటల సాగు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని, ప్రభుత్వ ప్రణాళికాలోపం వల్లే ఈ దుస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాభావ పరిస్థితుల్లో కూడా పంటలు ఎండకూడదని కేసీఆర్ ముందుచూపుతోనే కాళేశ్వం ప్రాజెక్టు నిర్మించారని గుర్తు చేశారు. కానీ, మేడిగడ్డ వద్ద కుంగిన ఒక పిల్లర్‌ను భూతద్దంలో చూపుతూ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే కూలినట్టు కాంగ్రెస్ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని, రైతులకు నీళ్లియ్యకుండా ముంచుతున్నారని మండిపడ్డారు.
ధర్మపురి మండలం బుద్దేశ్‌పల్లి వద్ద ఎండిన అక్కెపెల్లి చెరువును శుక్రవారం రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని, ఇప్పుడు రేవంత్ సర్కారు తప్పుడు విధానాలతో ఆగమయ్యే దుస్థితి వచ్చిందని ఆవేదన చెందారు. వానలు లేక సాగునీటి కోసం తండ్లాడుతున్నారని, నాట్లు వేసుకునేందుకు ఆరిగోస పడుతున్నారని చెప్పారు. ఎస్సారెస్పీలో కూడా ప్రస్తుతం 18 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నదని, అందులో 10టీఎంసీలు నీరు తాగునీటికే వినియోగిస్తారని, ఈ పరిస్థితుల్లో పంటలను ఏవిధంగా కాపాడుతారో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.
వర్షాలు సమృద్ధిగా పడని సమయంలో కూడా ధర్మపురి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరందించేలా తాము ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టామని గుర్తు చేశారు. ధర్మపురి, వెల్గటూర్ మండలాల్లో 14 ఎత్తిపోతల పథకాలు నిర్మించుకున్నామని చెప్పారు. ఇంకా చెక్‌డ్యాంలు, బోలిచెరువు- బందంమాటు, రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునీకరణ, ప్రతి గ్రామంలో చెరువుల పునరుద్ధరణ పనులను బీఆర్ఎస్ పాలనలో విజయవంతంగా పూర్తి చేశామన్నారు. అలాగే ధర్మపురి వరప్రదాయిని అయిన అక్కపెల్లి చెరువును కూడా గోదావరి నీటితో నింపేలా అప్పటి సీఎం కేసీఆర్ సహకారంతో 72.10 కోట్లు మంజూరు చేసి ఎత్తిపోతల పనులు ప్రారంభించుకున్నామన్నారు. కానీ, దురదృష్టవశాత్తు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు ముందుకు సాగడం లేదన్నారు.
గొల్లపెల్లి మండలం రంగధామునిపల్లిలో నారుపోసుకొని నీరందక బిందెలతో నీరు పోసుకునే దుస్థితి వచ్చిందన్నారు. ధమ్మన్నపేట ఎత్తిపోతల పథకం రిపేరుకు వచ్చిందని, స్టార్టర్లు కాలిపోయి నెలరోజులు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మంత్రి లక్ష్మణ్‌కుమార్ స్పందించి ఎత్తిపోతలకు మరమ్మతు పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, మళ్లీ కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారని చెప్పారు. మాజీ మంత్రి వెంట డీసీఎమ్మెస్ చైర్మన్ డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, నాయకులు అయ్యోరి రాజేశ్‌కుమార్, సౌళ్ల భీమయ్య, సంగి శేఖర్, చిలివేరి శ్యాంసుందర్ తదితరులున్నారు.