కరీంనగర్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలెట్ సర్వే సోమవారంతో ముగియనున్నది. ప్రతి పథకానికి ఈ కార్డునే ప్రామాణికంగా తీసుకోనున్న నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో ఒక మున్సిపల్ వార్డు, ఒక చిన్న గ్రామాన్ని ఎంపిక చేసుకుని అధికారులు పైలెట్ సర్వే నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 24 ప్రదేశాలను ఎంపిక చేసిన అధికారులు ఈ నెల 4న సర్వే ప్రారంభించారు. ఈ నెల 8న నోడల్ అధికారులకు వివరాలు అందించనుండగా 9, 10 తేదీల్లో ఆన్లైన్లో వివరాలు నమోదు చేయనున్నారు.
ఫ్యామిలీ డిజిటల్ కార్డులను ప్రతి కుటుంబానికి అందించే లక్ష్యంతో అధికారులు ఈ పైలెట్ సర్వే చేపట్టారు. కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి, చొప్పదండి, హుజూరాబాద్, పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, మంథని, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల మున్సిపాలిటీల్లో ఒక్కో వార్డును ఎంపిక చేసుకున్నారు. అలాగే, ఆయా నియోజకవర్గాలోని ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసుకుని 5,359 కుటుంబాలను సర్వే చేస్తున్నారు. సర్వే చేసేందుకు 11 కాలమ్స్‌తో ఉన్న ఒక ఫార్మెట్‌ను రూపొందించుకున్నారు. పైలెట్ కోసం ఎంపిక చేసుకున్న ఇండ్లకు వెళ్లి మహిళలను ఇంటి యజమానులుగా గుర్తించి కుటుంబ సభ్యుల పేర్లను సేకరిస్తున్నారు. వారికి ఇది వరకు ఏమైనా హెల్త్ కార్డులు ఉన్నాయా?, ప్రభుత్వ పథకాల ద్వారా పొందిన లబ్ధి వివరాలను సేకరిస్తున్నారు. ఇక నుంచి ప్రభుత్వ పథకాలు పొందాలంటే ఈ కార్డులను ప్రామాణికంగా తీసుకోనున్న నేపథ్యంలో కుటుంబ సభ్యుల ఫొటోలు కూడా సేకరిస్తున్నారు. సర్వే ప్రక్రియను కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుండగా ప్రతి నియోజకవర్గానికి ఒక నోడల్ అధికారిని, మండల స్థాయిలో తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోల పర్యవేక్షిస్తున్నారు. అంతే కాకుండా ఉమ్మడి జిల్లా పర్యవేక్షణకు ప్రత్యేకాధికారిగా ఆర్వీ కర్ణన్‌ను నియమించగా, ఆయన చొప్పదండిలో పరిశీలించారు. అయితే, ఫ్యామిలీ డిజిటల్ కార్డుల కోసం పైలెట్ సర్వే నిర్వహించినప్పటికీ ఆయా కుటుంబాలకు కార్డులు పంపిణీ చేస్తారా, లేదంటే ఇపుడు జరిగిన సర్వేను అనుభవంలోకి తీసుకుని లోటు పాట్లను సరిచేసుకుని పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించిన తర్వాతనే ఒకేసారి కార్డులు జారీ చేస్తారా? అనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత కనిపించడం లేదు.