Vemulawada | వేములవాడ, మే 29: వేములవాడ రాజన్న ఆలయాన్ని జూన్ 15 నుండి మూసివేస్తామని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని రాజన్న ఆలయ ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. సామాజిక మాధ్యమాల్లో కొందరు మూసివేస్తున్నట్లుగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ పేరిట ప్రకటనలు తిప్పుతున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని, దానిని పూర్తిగా తప్పుడు కథనంగా ఆయన ఖండించారు.
రాజన్న ఆలయాన్ని ఇప్పట్లో మూసివేసే అవకాశం లేదని ఇలాంటి తప్పుడు వార్తలు నమ్మవద్దని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న వారిని కఠినంగా శిక్షించి తగిన చర్యలు తీసుకోవాలని వేములవాడ పట్టణ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. జూన్ 15 నుండి ఎలాంటి బంద్ లేదని యథావిధిగా రాజన్న ఆలయంలో భక్తులకు అన్ని స్వామివారి నిత్య సేవలు అందుబాటులో ఉంటాయని ఈవో వినోద్ రెడ్డి స్పష్టం చేశారు.