ఉత్తర తెలంగాణకు కేంద్రమైన కరీంనగర్లో నకిలీ మందుల మూలాలు బయట పడుతున్నాయి. దేశంలోనే మెడికల్ వ్యాపార కేంద్రంగా మారిన ఉమ్మడి జిల్లాలో ఎక్కడో బిహార్‌లో తయారైన డూప్లికేట్ మందులు వెలుగు చూస్తున్నాయి. మెడికల్ ఏజెన్సీలు, మెడికల్ షాపులపై నిఘా లేకపోవడంతోనే వ్యాపారులు ఈ మందులు విక్రయిస్తూ అడ్డగోలుగా దోచుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. పైగా రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా, కొందరు వైద్యులు కూడా ఇవే మందులు రాస్తున్నా, కరీంనగర్ నకిలీ మందులకు కేరాఫ్‌లా మారినా పట్టించుకోవడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెడికల్ దందాను నియంత్రించాల్సిన డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు మాఫియా గుప్పిట్లో కీలు బొమ్మలుగా మారారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కరీంనగర్, జూలై 6 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్ : కరీంనగర్ మెడికల్ వ్యాపారుల సామ్రాజ్యంగా మారింది. ఇక్కడ దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద మొత్తంలో వ్యాపారం జరుగుతున్నది. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే నెలకు 450కోట్ల నుంచి 500 కోట్ల వ్యాపారం జరుగుతున్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న డూప్లికేట్ మందుల తయారీ సంస్థలు జిల్లాపై కన్నేశాయి. దీంతో మెడికల్ వ్యాపారంలో విచ్చలవిడిగా అక్రమాలు జరుగుతున్నట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
ఎక్కడో బిహార్ నుంచి లెవిపిల్-500 ట్యాబ్లెట్ దేశంలోనే మొదటి సారి కరీంనగర్లో వెలుగులోకి రావడం చర్చకు దారితీసింది. అయితే అస్సోంలోని సన్ ఫార్మా లెవిపిల్-500 ఒరిజనల్ ట్యాబ్లెట్స్ను తయారు చేస్తున్నది. పక్షవాతం నివారణకు ఈ మందు ప్రభావవంతంగా పని చేస్తుంది. ఎక్కువ మంది వైద్యులు ఈ మందునే రోగులకు రాస్తుండడంతో డిమాండ్ ఏర్పడింది. దీనిని ఆసరా చేసుకున్న మరో కంపెనీ అచ్చం సన్ ఫార్మా లేబుల్‌తోనే లెవిపిల్-500 డూప్లికేట్ మందులు తయారు చేయడం, బిహార్ నుంచి కరీంనగర్ మార్కెట్లోకి రావడం ఆందోళనకు చేస్తున్నది.
ఇది మచ్చుకు మాత్రమేనని చెప్పవచ్చు! నిజానికి జిల్లాలో విస్తరించి ఉన్న మెడికల్ ఏజెన్సీలు ఇలాంటి ఘాతుకాలకు పాల్పడడం ఇది మొదటిసారి కాదని తెలుస్తున్నది. గతంలోనూ ఇలాంటి డూప్లికేట్ మందులు పలుసార్లు వెలుగులోకి వచ్చాయి. అయితే లెవిపిల్-500పై ఏకంగా కంపెనీ ప్రతినిధులే అధికారులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమవుతున్నది. దీనిపై అధికారులు తప్పని సరిగా విచారణ చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ డూప్లికేట్ మందులు విక్రయిస్తున్న మెడికల్ ఏజెన్సీపై కేసు నమోదు చేయాల్సి వచ్చింది. లేదంటే గుట్టుచప్పుడు కాకుండా కనుమరుగైపోయే ప్రమాదముండేదనే చర్చ వైద్య రంగంలో జరుగుతున్నది.
బ్రాండెడ్ కంపెనీలే లక్ష్యంగా..
మెడికల్ రంగంలో బ్రాండెడ్ కంపెనీల ఫార్ములాలను లక్ష్యంగా చేసుకుని కొందరు డూప్లికేట్ మందులు తయారు చేస్తున్నట్టు తెలుస్తున్నది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నా ఫార్మా కంపెనీల్లో ఎక్కడో ఒక చోట తయారయ్యే ఈ డూప్లికేట్ మందులు మొదట వచ్చేది కరీంనగర్ మార్కెట్కేనని అర్థమవుతున్నది. ఇక్కడ వందల కోట్లలో వ్యాపారం జరుగుతున్న నేపథ్యంలో ఇలాటి కేటుగాళ్లు ఇక్కడి మార్కెట్‌నే ఎంచుకుంటున్నారు. ఎక్కువగా బీపీ, షుగర్, కిడ్నీ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు డూప్లికేట్ మందులు వస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.
ఈ తరహా మందులు మెడికల్ ఏజెన్సీలకు, మందుల దుకాణాలకు అసలు కంపెనీల ధరల కంటే తక్కువకే లభిస్తున్నాయి. సంబంధిత డూప్లికేట్ కంపెనీల ఉద్యోగులు ఏజెన్సీలే కాకుండా కొంత మంది వైద్యులను కూడా మచ్చిక చేసుకుని ఈ మందులు కట్టబెడుతున్నట్టు తెలుస్తున్నది. ఏజెన్సీలకు మంచి కమిషన్ ఇవ్వడమే కాకుండా ఎక్కువ మొత్తంలో విక్రయిస్తే పెద్ద మొత్తంలో ఇన్సెంటివ్‌లు, విదేశీ టూర్లకు కూడా తీసుకెళ్తున్నట్టు సమాచారం అందుతున్నది. బ్రాండెడ్ కంపెనీలు తయారు చేస్తున్న మందులకు ప్రతిగా డూప్లికేట్ మందులు రోగులకు ఇవ్వడం వలన అనేక దుష్ప్రరిణామాలు ఎదురవుతున్నాయి.
డూప్లికేట్ మందుల్లో 65 నుంచి 85 శాతం మాత్రమే నిజమైన మందులకు సంబంధించిన ఫార్ములా ఉంటుందని, ఒక్కోసారి 30 నుంచి 40 శాతం ఫార్ములానే ఉంటుందని కొందరు వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి మందులు వాడడం వల్ల రోగాలు నయం కాకపోవడం అటుంచితే మందులు వాడినా తగ్గకుండా ప్రాణాల మీదికి వచ్చే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు మంచి మందులు రాసినా, మెడికల్ దుకాణాల్లో ఇచ్చే వాటిపైనే రోగుల జీవితాలు ఆధారపడి ఉంటున్నాయి. వైద్యులు రాసిన మందులు మెడికల్ షాపుల్లో లభిస్తాయన్న నమ్మకం లేకుండా పోయింది.
రోగులు అప్రమత్తంగా ఉండాలి
నిజానికి కొందరు వైద్యులు కూడా మెడికల్ మాఫియా చేతిలో కీలుబొమ్మలుగా మారి వారి వ్యాపారానికి సహకరిస్తున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ఏజెన్సీలు ఇచ్చే కమీషన్లకు ఆశ పడి వైద్యులు కూడా వారు చెప్పిన మందులనే రాస్తున్నట్టు తెలుస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో రోగులు డ్రగ్స్ మాఫియా ఆగడాలకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని మరి కొందరు వైద్యులు సూచిస్తున్నారు.
వైద్యులు రాసిన మందులు ఏ మెడికల్ షాపులో తీసుకున్న ఒక సారి క్రాస్ చెక్ చేసుకోవాలని, వైద్యులకు లేదా వారి సహాయకులకు తప్పని సరిగా చూపించిన తర్వాతనే వాడుకోవాలని చెబుతున్నారు. ప్రతి మందు లేబుల్‌పై క్యూఆర్ కోడ్ ఉంటుంది. దీనిని స్కాన్ చేసుకుంటే ఆ మందులు ఎక్కడ తయారయ్యాయి? ఎప్పుడు తయారయ్యాయి? అనే వివరాలు స్పష్టంగా ఉంటాయని, ఈ కోడ్ ఆయా ప్రభుత్వాల ద్వారా జారీ చేయబడతాయని, ఒక వేళ అవి డూప్లికేట్ మందులైతే ఎలాంటి వివరాలు ఉండవని స్పష్టం చేస్తున్నారు. వీటిని తప్పని సరిగా పరిశీలించిన తర్వాతనే మందులు వాడుకోవాలని రోగులకు సూచిస్తున్నారు.
అధికారులు ఏం చేస్తున్నారు?
ఫార్మా కంపెనీలు ఫిర్యాదు చేస్తేగానీ మేలుకోని అధికారులు మెడికల్ మాఫియా చేతిలో కీలు బొమ్మలుగా మారారనే ఆరోపణలు వస్తున్నాయి. 450 మెడికల్ ఏజెన్సీలు, 2500కుపైగా మెడికల్ షాపులు విస్తరించి ఉన్న కరీంనగర్ జిల్లా నుంచి చుట్టుపక్కల జిల్లాలకు రిటైల్ వ్యాపారాలు పెద్ద మొత్తంలో జరుగుతుంటాయి. ఇక్కడి నుంచి ఉత్తర తెలంగాణలోని అనేక జిల్లాలకు మందులు సరఫరా అవుతుంటాయి. కానీ, ఇక్కడ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయానికి అతీగతీ లేనట్టు ఉన్నది. ఉమ్మడి జిల్లాకు ఒక ఏడీ, జిల్లాకు ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టు మాత్రమే ఉంది. చాలా కాలంగా ఇలాగే కొనసాగుతున్నది.
ఈ శాఖ పరిస్థితిని ఆసరా చేసుకుంటున్న మెడికల్ మాఫియా అక్రమార్జన కోసం రెచ్చి పోతున్నది. కమీషన్లకు కక్కుర్తి పడుతూ తక్కువ ధర మందులు తెచ్చి ఎక్కువ ధరకుల విక్రయిస్తున్నారు. తప్పిదారి దొరికిపోతే అధికారులు వేలల్లో ఫెనాల్టీలు, లక్షల్లో లంచాలు పట్టించి గుట్టు చప్పుడు కాకుండా వదిలేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో జరిగే మెడికల్ వ్యాపారంపై నిఘా పెట్టాలంటే కనీసం 20 మంది ఉద్యోగులైనా ఉండాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తున్నది.