Eye surgeries | కోల్ సిటీ, జూలై 11: కంటి చూపుతో బాధపడుతూ కంటి ఆపరేషన్లు చేయించుకోలేని స్థితిలో ఉన్న పలువురికి లయన్స్ క్లబ్ చేయూత అందించింది. ఈమేరకు శుక్రవారం గోదావరిఖని లయన్స్ క్లబ్ భవన్లో కరీంనగర్ రేకుర్తి కంటి దవాఖాన సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించింది. ఈ శిబిరంలో దీర్ఘకాలిక కంటి సమస్యతో బాధపడుతున్న 28 మంది బాధితులను గుర్తించారు. వారికి ఉచిత బస్సు ప్రయాణం కల్పించి కరీంనగర్ రేకుర్తి హాస్పిటల్ కు తీసుకవెళ్లి కంటి ఆపరేషన్లు చేయించారు.
ప్రతీ ఒక్కరి దైనందిన జీవితం ప్రారంభంలో కంటి చూపు కీలకమనీ, ఆ సమస్యతో బాధపడే నిరుపేదలకు వ్యయ ప్రయాసాలను భరించి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయిస్తున్నామని లయన్స్ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ పీఎస్టీలు ఎల్లప్ప, సారయ్య, రాజేంద్రకుమార్, లయన్ ఎం గంగాధర్, జడ్సీ మల్లికార్జున్, తిలక్ చక్రవర్తి, బంక రామస్వామితోపాటు సభ్యులు పాల్గొన్నారు.