మెట్పల్లి, ఆగస్టు 3 : ఈజీ మనీ కోసం ఆ ఆరుగురు ముఠాగా ఏర్పడి, అడ్డదారులు తొక్కారు. అసలు లక్షకు 5లక్షల నకిలీ నోట్లు ఇస్తామని ఎరవేసి, ఆపై బైక్‌పై వచ్చి అసలు నోట్లు లాక్కొని పరారవుతారు. ఇలా ఏడాది కాలంగా దోపిడీకి పాల్పడుతుండగా.. ఎట్టకేలకు ఆరుగురు నిందితులు పోలీసులకు చిక్కారు.
మెట్పల్లి పోలీస్ సబ్ డివిజనల్ అధికారి కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నకిలీ కరెన్సీ ముఠా సభ్యుల అరెస్ట్‌ను చూపారు. డీఎస్పీ ఉమామహేశ్వర్రావు వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లాకు చెందిన సదాల సంజీవ్, బిట్టు శివకుమార్, నిర్మల్ జిల్లా మగ్గిడి కిషన్, కలకుంట్ల గంగారాం, బొంగురాల మల్లయ్య ఉరఫ్ పులి, మునిమానికల అశోక్ ఒక ముఠాగా ఏర్పడ్డారు.
ఈజీ మనీకి అలవాటు పడి, తాము సేకరించిన నకిలీ నోట్లతో దందా చేయాలని అనుకున్నారు. నకిలీ 5 లక్షల నోట్లకు అసలు లక్ష తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. కారులో ఇద్దరు, బైకుపై ఇద్దరేసి చొప్పున నోట్ల మార్పిడికి వెళ్లాలని, కారులో నోట్లు మారుస్తున్నప్పుడు బైక్‌పై ఇద్దరు వచ్చి ‘పోలీస్, పోలీస్’ అని అరిచి ఒరిజినల్ నోట్ల కట్టలను ఇస్తున్న వ్యక్తి నుంచి లాక్కొని పారిపోవాలని పథకం వేశారు.
అలా అయితే బాధితులు పోలీసులకు కూడా చెప్పుకోలేరని భావించి, ఈ పథకాన్ని ఏడాది నుంచి అమలు చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ముగ్గురిని, ధర్మపురిలో ఒకరిని, కరీంనగర్లో ఒకరిని, జన్నారంలో ఒకరిని, జగిత్యాలలో ఒకరిని నమ్మించి, అసలు 10 లక్షల వరకు పోగేసుకున్నారు. ఈ నెల ఒకటిన రాత్రి మెట్పల్లి మండలం చౌలమద్ది శివారులోని పెద్దగుండు సమీపంలో దాబా యజమాని రాజేందర్‌కు నకిలీ 5 లక్షలు ఇస్తామని చెప్పి అసలు లక్ష లాక్కొని పారిపోయారు.
ఈ నెల 2న రాజేందర్ మెట్పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. స్థానిక సీఐ నిరంజన్‌రెడ్డి నేతృత్వంతో ఎస్ఐలు చిరంజీవి, రాజు, పోలీస్ సిబ్బంది ఈ ముఠా కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో శనివారం మెట్పల్లి మున్సిపల్ పరిధిలోని వెంకట్రావుపేటలో సమీపంలోని వీరేంద్ర దాబా లో ఆరుగురు సభ్యులు ఉన్నట్టు సమాచారం అందడంతో హుటాహుటిన అక్కడికి చేరుకొని, నిందితులను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.
వారి నుంచి 7 లక్షల నకిలీ నోట్లు (1400), ఒక నెక్సాన్ కారు, పల్సర్, సెల్ఫోన్లను, 5,050 నగదును స్వాధీనం చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి, మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు జ్యుడీషిల్ రిమాండ్‌కు తరలించారు. నకిలీ ముఠాసభ్యులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ నిరంజన్‌రెడ్డిని, పోలీస్‌సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.