కొండలు, పెద్ద పెద్ద బండలను పిండిగా మార్చే ప్రమాదకర పేలుడు పదార్థాల దందా పెద్దపల్లి జిల్లాలో జోరుగా సాగుతున్నది. సంబంధిత శాఖల నిర్లక్ష్యం.. పట్టింపులేమితో అక్రమ వ్యాపారం మూడు పూలు, ఆరు కాయలుగా విస్తరిస్తున్నది. అనుమతుల పేరిట జిలెటిన్ స్టిక్స్, డీ గార్డ్(బత్తులు), డిటోనేటర్లను ఎవరికి పడితేవారికి డబ్బులు ఎక్కువిస్తే చాలు ‘నో బిల్.. నో రిసిస్ట్’ అన్నట్లుగా నడుస్తున్నది. రాత్రి వేళల్లో బైకులపై రవాణా చేయడం, కాలపరిమితి ముగిసిన కంకర క్వారీలకు సరఫరా చేస్తుండగా, ఇదే సమయంలో అసాంఘిక శక్తుల చేతుల్లోకి సైతం వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
.. ఈ ఫొటోలో కనిపిస్తున్నది పెద్దపల్లి మండలం భోజన్నపేట, కొత్తపల్లి గ్రామాల మధ్య హుస్సేన్‌మియా వాగుపై చెక్‌డ్యాం. ఇది మూలసాల గ్రామ సమీపంలో ఉంటుంది. అయితే, 2024 జనవరి 15న జిలెటిన్ స్టిక్స్ పెట్టి ఈ చెక్‌డ్యాంను పేల్చి వేసేందుకు కొంత మంది ప్రయత్నించారు. కంప్రెషర్‌తో డ్రిల్లింగ్ చేస్తున్న శబ్ధం రావడం, సమీపంలోని రైతులు వచ్చి చూడడంతో జిలెటిన్ స్టిక్స్, డ్రిల్లింగ్ యంత్రాన్ని అక్కడే వదిలేసి ట్రాక్టర్‌తో సహా పారిపోయారు. అయితే, ఇన్ని రోజులు గడుస్తున్నా చెక్‌డ్యాం కూల్చేందుకు ఎవరు యత్నించారు..? అనేది మిస్టరీగానే మిగిలింది. ఈ విషయంలో ఇరిగేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.
పెద్దపల్లి, మార్చి 15(నమస్తే తెలంగాణ): జిల్లాలో ప్రమాదకర పేలుడు పదార్థాలు జిలెటిన్ స్టిక్స్, డీ గార్డ్(బత్తులు), డిటోనేటర్ల విక్రయాల అక్రమ దందా విచ్చలవిడిగా జరుగుతున్నది. జిల్లాలో 150వరకు క్వారీలు ఉన్నాయి. ఇందులో అఫీషియల్‌గా 16వరకు అనుమతులతో నడుస్తున్నాయి. పలు రకాల కారణాలతో మిగతావాటి అనుమతులను నిలిపివేశారు. అయినప్పటికీ క్వారీల్లో ఎక్స్‌ప్లోజివ్ పేల్చివేతల కోసం పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను వినియోగిస్తున్నారు. జిల్లాలో రెండు సంస్థలకు మాత్రమే పేలుడు ఎక్స్‌ప్లోజివ్ లైసెన్స్ ఉన్నది. పెద్దపల్లి మండలం బొంపల్లిలో ఒక ఫర్మ్ పేరుతో పెద్ద ఎత్తున విక్రయాలు సాగుతుండగా, జూలపల్లి మండలంలోని మరో ఫర్మ్ పేరుతో ఎక్స్‌ప్లోజివ్ లైసెన్స్‌లను కలిగి ఉన్నారు. వీరు ఎక్స్‌ప్లోజివ్ లైసెన్స్ ఉన్నవారికి, అది కూడా పగటిపూట మాత్రమే సరఫరా చేయాలి. పోలీస్ శాఖ నుంచి బ్లాస్టింగ్ అనుమతులు ఉన్న క్వారీలకు మాత్రమే సప్లయి చేయాలి.
ఇలా సవాలక్ష నిబంధనలు ఉన్నా పట్టించుకునేవారు లేక ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ అనుమతి లేకుండా సీజ్ చేసిన, కాలపరిమితి ముగిసిన కంకర క్వారీలకు విక్రయాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. అంతేకాదు క్వారీలు, బావుల తవ్వకానికి మాత్రమే ఉపయోగించే వాటిని బయటి వ్యక్తులకు విక్రయిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఎవరు వచ్చి అడిగినా, వీరు చెప్పే ధర చెల్లిస్తే చాలు విక్రయించే విధానం కొనసాగుతున్నది. దీంతో ఇవి అసాంఘిక శక్తులకు సైతం చేరుతున్నాయనే ప్రచారం సాగుతున్నది. విక్రయ కేంద్రాల వద్ద కనీసం రికార్డులను సైతం మెయింటేయిన్ చేయడం లేదని, ‘నో బిల్.. నో రిసిప్ట్’ అన్న చందంగా జోరుగా పేలుడు పదార్థాలను విక్రయిస్తున్నారే విమర్శలు వినిపిస్తున్నాయి. కంప్లీట్ జీరో దందాగా సాగుతున్న ఈ వ్యాపారాన్ని పోలీసులు కట్టడి చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
నిబంధనలకు నీళ్లు..
పేలుడు పదార్థాలను విక్రయించాలన్నా, వినియోగించాలన్నా ఇటు పోలీస్ శాఖ నుంచి, అటు మైనింగ్ శాఖ నుంచి పూర్తిగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. విక్రయదారుడు ఎక్స్‌ప్లోజివ్ లైసెన్స్ కలిగి ఉండడంతో పాటు వాటిని షార్ట్ ఫైర్ లైసెన్స్ కలిగిన వారికి ప్రత్యేకమైన ఎక్స్‌ప్లోజివ్ ప్రొటెక్షన్ సెక్యూర్ వాహనంలో వాటిని తరలించాల్సి ఉంటుంది. క్వారీల్లో షార్ట్ఫైర్ లైసెన్స్ కలిగిన వారు మాత్రమే ఈ పేలుడు పదార్థాలను పేల్చాల్సి ఉంటుంది. ఆ సమయంలో అనేకమైన రక్షణ చర్యలను తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ విక్రయాల్లో కానీ, కొనుగోళ్లలో కానీ, రవాణాలో కానీ, వినియోగంలో కానీ పూర్తిగా నిబంధనలకు నీళ్లు వదిలారు. పేలుడు పదార్థాలను రాత్రివేళ బొంపల్లి నుంచి బైక్‌లపై నేరుగా క్వారీలకు తరలిస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. పర్యవేక్షించాల్సిన పోలీస్, మైనింగ్ శాఖలు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.
పోలీసుల ఉదాసీనత..
జిల్లాకు సంబంధించి ఏడాది క్రితమే రెండు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకటి ప్రభుత్వ ఆస్తి అయిన హుస్సేన్‌మియా వాగుపై నిర్మించిన చెక్‌డ్యాం పేల్చివేతకు కుట్ర, మరో ఘటనలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మావోయిస్టులకు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్న పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బామ్లానాయక్ తండాకు చెందిన కొంత మందిని పోలీసులు అరెస్టు చేయడం. ఈ రెండు ఘటనల్లో మందు పాతరలు పట్టుబడ్డా, పెద్దపల్లితో సంబంధం ఉన్నా, అసలు అవి ఎక్కడి నుంచి వచ్చాయి..? ఎలా వచ్చాయి. ఎవరు ఇచ్చారు..? అనే కోణంలో విచారించకపోవడం, కేసులు కూడా నమోదు చేయకపోవడంలోనే పోలీసుల ఉదాసీనత కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. ఈ విషయంపై జిల్లా మైనింగ్ అధికారి ఏ శ్రీనివాస్‌ను వివరణ కోరగా, ఇది తన పరిధిలోకి రాదని, పోలీసుల పరిధిలోకే వస్తుందని తెలిపారు. బసంత్‌నగర్ ఎస్ఐని వివరణ కోరగా రామగుండం పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఉంటుందని తెలిపారు.