Dasari Usha | పెద్దపల్లి, డిసెంబర్ 06(నమస్తే తెలంగాణ): బీసీల రిజర్వేషన్ల కోసం ఏ బీసీ బిడ్డ ఆత్మబలిదానం చేసుకోవద్దని, ఈశ్వరాచారి త్యాగమే చివరిది కావాలని, బీసీలను మోసం చేసే వారికి గట్టి గుణపాఠం చెప్పాలని బీసీ జేఏసీ పెద్దపల్లి జిల్లా చైర్పర్సన్ దాసరి ఉషా డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం హైదరాబాద్లో ఆత్మాతి చేసుకున్న ఈశ్వరాచారి కుటుంబానికి ప్రభుత్వం రూ. 1కోటి ఎక్స్ గ్రేషియా చెల్లించాలని శనివారం పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ కోయ శ్రీహర్షను కలిసి బీసీల పట్ల జరుగుతున్న సామాజిక దాడులను వెంటనే నిలిపివేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల నల్గొండ జిల్లా కేంద్రంలో జనరల్ స్థానంలో పోటీకి నామినేషన్ వేసిన బీసీ అభ్యర్థి భర్త పట్ల జరిగిన అనాగరిక సంఘటన సభ్య సమాజానికి సిగ్గుచేటు అన్నారు. అంతే కాకుండా బీసీ రిజర్వేషన్లను కోరుతూ ఈశ్వరాచారి ఆత్మబలిదానం తీవ్రంగా కలచి వేసిందన్నారు. ఇది ముమ్మూటికి ఆత్మహత్య కాదు.. ప్రభుత్వం చేసిన హత్యేనని ఆమె ఆరోపించారు. ప్రభుత్వం ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఈశ్వరాచారి కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియాతో పాటుగా వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్నారు.
వారి పిల్లలకు పీజీ వరకూ ప్రభుత్వ ఖర్చులతో విద్యాభ్యాసం చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ రిజర్వేషన్ల పేరిట కల్లబొల్లి కబుర్లు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారని మండిపడ్డారు. బీసీ బిడ్డలు ప్రాణాలను తీసుకొని బొందలో పడటం కాదని, ఆ పార్టీలనే బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. బీసీలను సంఘటితం చేస్తూ ఒక్కతాటిపైకి తీసుకువచ్చి బీసీ రిజర్వేషన్లు సాధిస్తామని పేర్కొన్నారు. ఇందుకు గాను బీసీ బిడ్డలు ఇంటికొకరు ఉద్యమ బాట పట్టాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ వైస్ చైర్మన్ కొండి సతీష్, జిల్లా కన్వీనర్లు సలేంద్ర కొమురయ్య, సిరవేని స్వప్న, మిట్టపల్లి శ్రీనివాస్, కలవేని రవి, విశ్వకర్మ జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.