Gummadi Narsaiah biopic | కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ ప్రధాన పాత్రలో ప్రజానాయకుడు, ప్రజలకు సేవకుడు గుమ్మడి నర్సయ్య జీవిత కథ ఆధారంగా చిత్రం తెరకెక్కుతోంది. గుమ్మడి నర్సయ్య పేరునే టైటిల్‌గా పెట్టిన ఈ బయోపిక్కు పరమేశ్వర్ దర్శకత్వం వహిస్తుండగా, ఎన్. సురేష్ రెడ్డి ప్రవళ్లిక బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు భవ్యంగా జరిగాయి. ఈ వేడుకకు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే కూనేని సాంబశివరావు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈవెంట్లో శివ రాజ్‌కుమార్ చేసిన స్పీచ్ అందరి మనసును దోచుకుంది. మంచి మనిషి జీవితాన్ని పెద్ద తెరపై చూపించే అవకాశం రావడం గర్వకారణంగా భావిస్తున్నట్లు తెలిపారు.
మా నాన్న గారు ఎప్పుడూ మనం మన కోసం కాదు… ఇతరుల కోసం బ్రతకాలని చెప్పేవారు. నర్సయ్య గారిని చూశాక నిజంగా అదే భావన వచ్చింది. ఆయన ఇంటికి వెళ్లినప్పుడు మా ఇల్లు చూసినట్టు అనిపించింది” అని చెప్పారు. నర్సయ్యను చూసినప్పుడు తమకు తాము చెందిన మనుషులను కలిసిన భావన కలిగిందని, ఆయన జీవితాన్ని తాను ఎంతో గౌరవంతో పోషిస్తానని తెలిపారు. శివ రాజ్‌కుమార్ కార్యక్రమంలో ఎక్కువ భాగం తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించారు. “తప్పుగా మాట్లాడినా ఏమి అనుకోకు. నెక్స్ట్ టైమ్ ఇంకా బాగా మాట్లాడతాను. ఈ సినిమాకు డబ్బింగ్ నేనే చెప్తా” అని చెప్పడంతో ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.
గుమ్మడి నర్సయ్యను తన తండ్రితో పోలుస్తూ, వారి కాళ్లకు వేదికపైనే నమస్కరించిన శివ రాజ్‌కుమార్ వినయం అందరినీ ఆకట్టుకుంది. కన్నడలో సూపర్ స్టార్ అయినా… పెద్దల పట్ల ఆయన చూపిన గౌరవం అక్కడ ఉన్న వారందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ సినిమా రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు గొప్ప ప్రేరణగా నిలుస్తుందని శివ రాజ్‌కుమార్ భావించారు. నర్సయ్య కథను దేశం మొత్తం చూడాలని కోరుకున్న మేకర్స్ ఈ చిత్రాన్ని పాన్-ఇండియా స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రాజకీయాల్లో ప్రజల కోసం జీవించిన గుమ్మడి నర్సయ్య కథను పెద్ద తెరపై చూపించేందుకు భారీ స్థాయిలో షూట్ చేయనున్నట్లు టీమ్ వెల్లడించింది.