గోదావరిఖని, ఫిబ్రవరి 8: పట్టణంలోని ప్రధాన వ్యాపార కేంద్రం లక్ష్మీనగర్‌లో చిరు వ్యాపారులపై కక్ష ఎందుకని, అభివృద్ధి పేరిట వారి జీవితాలను రోడ్డు పాలు చేయడం సరికాదని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ పేర్కొన్నారు. శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దుకాణాలను కూల్చివేయడంతో వ్యాపారులు భయాందోళనకు గురవుతున్నారని, వారిని రోడ్డు పాలు చేయడం రాజాకీయ కక్ష సాధింపు చర్యనేనని ఆరోపించారు. వివాహాల సీజన్లో చిరు వ్యాపారుల దుకాణాలను కూల్చివేయడం సరికాదన్నారు.
అప్పులు చేసి వ్యాపారం కొనసాగిస్తున్న క్రమంలో కూల్చివేతలతో రోడ్డున పడుతున్నారని, వారికి ప్రత్యామ్నాయం చూపెట్టిన తర్వాత కూల్చివేతలు చేపట్టాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో నియోజకవర్గంలో తాను మెడికల్ కళాశాల, సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధికి పెద్దపీట వేస్తే కాంగ్రెస్ ఇలా విధ్వంసక పాలన కొనసాగించడం సరికాదన్నారు. ఇక్కడ మాజీ కార్పొరేటర్ బాదె అంజలి, నాయకులు నారాయణదాసు మారుతి, రాకం వేణు, బొడ్డు రవీందర్, సట్టు శ్రీనివాస్, జక్కుల తిరుపతి, మేతుకు దేవరాజ్, తోకల రమేశ్, శ్రావణ్, వెంకటేశ్, రాములు, కనకలక్ష్మీ, స్వప్న ఉన్నారు.