కరీంనగర్ కార్పొరేషన్, సెప్టెంబర్ 01 : కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నో అబద్దాలు చెప్పారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేశారో చెప్పాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నిలదీశారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటైనా పూర్తిస్థాయిలో అమలు చేశారా? అని ప్రశ్నించారు. ఏ మొఖం పెట్టుకొని కేసీఆర్ ప్రజల్లోకి వస్తారు? అని ప్రశ్నిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. అసలు అధికారంలో ఉండి ఏ ఘనకార్యం చేశారని మంత్రులు, కాంగ్రెస్ నేతలు ప్రజల్లో తిరుగుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆదివారం కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి ఒక్కటైనా అమలు చేసిందా? అని ప్రశ్నించారు. రుణమాఫీ అని గొప్పులు చెప్పుకుంటున్న కాంగ్రెస్‌కు సిగ్గుండాలన్నారు. ఒక్క గ్రామంలోనైనా పూర్తి స్థాయిలో అమలు చేశారా? అని ప్రశ్నించారు. ఏ గ్రామానికైనా వచ్చి పూర్తిస్థాయిలో రుణమాఫీ చేసినట్లు నిరూపిస్తారా? అని నిలదీశారు.
ఎన్నికల్లో ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎంత మందికి చేశారన్నారు. రాష్ట్రంలో 40 శాతానికి మించి రుణమాఫీ జరగలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చెప్పిన వాటితోపాటు చెప్పని ఎన్నో పథకాలను అమలు చేసి చూపించిందన్నారు. సవాలక్ష ఆంక్షలు పెట్టి రుణమాఫీ అని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. పదేళ్ల ముందు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందని, ఆ సమయంలో వ్యవసాయం సాగిందా? సాగు నీళ్లు ఉన్నాయా? అని నిలదీశారు. రైతుల ఆత్మహత్యలు, ఆకలిచావులు, వలసలు లేవా? అని ప్రశ్నించారు.
కేసీఆర్ పాలనలో ప్రాజెక్టుల నిర్మాణం జరిగిందని, నీళ్లు వచ్చాయన్నారు. కాంగ్రెస్ ఆది నుంచి కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేసిందన్నారు. కానీ, అదే ప్రాజెక్టు ఇప్పుడు జీవనాధారంగా నిలిచిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పోలీసులు, గురుకులాలు, వ్యవసాయం, కొత్త జిల్లాల ఏర్పాటు, తదితర వాటితో 2 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. కాంగ్రెస్ హయాంలో సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలను తీసి వేస్తే కేసీఆర్ హయాంలోనే మళ్లీ తీసుకువచ్చి 19 వేల ఉద్యోగాలను కల్పించామన్నారు.
కార్మికులకు అండగా అనేక కార్యక్రమాలను కేసీఆర్ తీసుకున్నారని గుర్తు చేశారు. ఎంతో నాణ్యతతో తాము గురుకులాలను ఏర్పాటు చేస్తే ఇప్పుడు వాటిల్లో పురుగుల అన్నం తినలేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికే 37 మంది విద్యార్థులు చనిపోయారని చెప్పారు. ఇంకా సిగ్గు లేకుండా కాంగ్రెస్ నాయకులు కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. గత పదేళ్లల్లో డెంగ్యూ, చికెన్ గున్యా వంటి రోగాలు ప్రబలలేదని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ చేతగానితనంతో గ్రామాలు అనారోగ్యం బారిన పడుతున్నాయన్నారు.
పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రభుత్వ దవాఖానల్లో సౌకర్యాలు కూడా కల్పించడం లేదని దుయ్యబట్టారు. రైతుభరోసా ఎక్కడపోయిందని, కళ్యాణిలక్ష్మి కింద ఇస్తానన్న తులం బంగారం ఏదని ప్రశ్నించారు. ఇన్ని అబద్దాలు ఆడిన సీఎంను, ప్రభుత్వాన్ని ప్రపంచంలో ఎక్కడా చూడలేదన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రజలు తరిమికోట్టే రోజులు వస్తాయని హెచ్చరించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ మంత్రులు, నాయకులు జాగ్రత్తగా మాట్లాడాలని హితవుపలికారు. సమావేశంలో మాజీ మేయర్ రవీందర్‌సింగ్, మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్, బీఆర్ఎస్ నాయకులు పెండ్యాల మహేశ్, కెమసారం తిరుపతి, గుంజపడుగు హరిప్రసాద్ పాల్గొన్నారు.