యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. రోజులు గడుస్తున్నా కొరత తీరక రోడ్డెక్కుతున్నారు. వరి, పత్తి, మక్క, మిర్చి పంటలకు యూరియా వేయాల్సిన కీలక సమయంలో నిల్వలు లేక కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ఎక్కడ చూసినా తిండితిప్పలు మాని గంటల తరబడి పడిగాపులు గాస్తున్నారు. ఇచ్చే అరకొర కొందరికే సరిపోతుండగా, మిగతా రైతులంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వానలో తడుస్తూ నిల్చునా.. రాత్రి వరకు బారులు తీరినా సరిపడా దొరకడం లేదని వాపోతున్నారు. బీఆర్ఎస్ పాలనలోలేని ఈ దుస్థితి ఇప్పడెందుకు వచ్చిందని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్నడూ ఇలా ఇబ్బంది పడలేదని గుర్తు చేస్తూనే.. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు.
వర్షాలు పడుతున్న వేళ పంటలకు యూరియా అందించాల్సి ఉంటుంది. ఇప్పుడు వేస్తేనే పంట మంచిగా ఎదిగి, దిగుబడి వచ్చే అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో యూరియా వాడకం ఎక్కువగా ఉంటుంది. వచ్చే నెలలో వరి పొట్ట దశకు చేరుకుంటుంది. అప్పుడు వినియోగం మరింత పెరుగుతుంది. ఈ పరిస్థితుల్లో కొరత వెంటాడుతుండగా, రైతులు అరిగోస పడాల్సి వస్తున్నది. అదనులో చల్లకుంటే దిగుబడిపై ప్రభావం చూపే ప్రమాదముంటుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
కరీంనగర్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా, ప్రైవేట్ డీలర్ల ద్వారా యూరియా అమ్మకాలు సాగిస్తున్నది. మార్క్‌ఫెడ్ ద్వారా సింగిల్ విండోలు, ఆగ్రో, గ్రోమోర్ సెంటర్లకు సరఫరా చేస్తున్నది. అక్కడి నుంచి రైతులకు అందిస్తున్నది. ప్రైవేట్ డీలర్లకు ఆయా కంపెనీల నుంచి కేటాయింపులు జరుగుతుండగా, వీటిని అధికారుల పర్యవేక్షణలోనే పంపిణీ చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు దాదాపు అన్ని డీలర్ దుకాణాల్లో యూరియా నిల్వలు నిండుకున్నాయి.
మార్క్‌ఫెడ్ వద్ద కూడా పెద్దగా లేవు. ఆదివారం వరకు కరీంనగర్ జిల్లాలో కేవలం 1,594 మెట్రిక్ టన్నులే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కో ఏరియాకు ఒక్కోసారి అధికారులు యూరియా సరఫరా చేస్తున్నారు. సోమవారం గంగాధర మండలం గర్షకుర్తిలో యూరియా పంపిణీ చేశారు. అయితే, ఏ రైతుకూ సరిపడా ఇవ్వలేదు. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే కాదు, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలోనూ ఇలాంటి పరిస్థితే ఉన్నది. ఎక్కడ చూసినా అవసరం మేర ఇవ్వడం లేదు.
నిజానికి ఒక ఎకరానికి మూడు దఫాల్లో 95 నుంచి 95 కిలోల యూరియా మాత్రమే వాడాలి. నాటు వేసిన పది పదిహేను రోజుల్లో 30 కిలోలు, పిలక దశలో 35 కిలోలు, పొట్ట దశలో మరో 30 కిలోలు వాడితే సరిపోతుంది. కానీ, ఇప్పుడు అధికారులు మాత్రం ఒక రైతు ఎన్ని ఎకరాల్లో పంట సాగు చేశాడు? ఎన్ని యూరియా బస్తాలు అవసరం? అనేది పరిశీలించకుండా ఒకటి లేదా రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్నారు. దీనికి ఆధార్ కార్డును ప్రాతిపదికగా తీసుకుంటున్నారు.
ఆ తర్వాత రైతు మరెక్కడైనా తెచ్చుకునేందుకు వీలు లేకుండా ఈ పాస్ మిషన్లలో ఆధార్ కార్డు ఎంట్రీ చేస్తున్నారు. అయితే ఒకటి రెండు బస్తాలు ఇస్తే ఎకరానికే సరిపోతుందని, అంతకంటే ఎక్కువ ఎకరాలు పంట సాగు చేసిన వారి పరిస్థితి ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. రైతుల అవసరాన్ని బట్టి పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నా, ఇవ్వడం లేదని వాపోతున్నారు.
మండిపడుతున్న రైతులు
ఉమ్మడి రాష్ట్రంలో ఎరువుల కోసం రైతులు పడిన కష్టాలను ప్రత్యక్షంగా చూసిన కేసీఆర్, స్వరాష్ట్రంలో ఎరువులు ఏ విధంగా ఇబ్బంది లేకుండా చేశారు. ప్రతి సీజన్‌కు ముందే ఎరువులు తెప్పించి జిల్లా కేంద్రాల్లో నిల్వ చేయించారు. ఎరువుల వినియోగం రెండింతలు పెరిగినా ఎక్కడా కొరత రాకుండా చూశారు. ఏప్రిల్, మే నెలల్లో కేంద్రంతో, ఎరువుల కంపెనీలతో చర్చించి డబ్బులు చెల్లించారు. కానీ, కాంగ్రెస్ పాలనలో పరిస్థితి పూర్తిగా మారింది. గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా తామిప్పుడు యూరియా కోసం అష్ట కష్టాలు పడాల్సి వస్తున్నదని రైతులు వాపోతున్నారు.
తొలకరి పలకరించిన తర్వాత ఎప్పుడు అవసరముంటే అప్పుడు వెళ్లి ఎరువులు తెచ్చుకున్నామని, ఎరువులకు ఏ ఇబ్బంది పడలేదని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు నాటి ఉమ్మడి రాష్ట్రంలోని పరిస్థితులు పునరావృతం అవుతున్నాయని మండి పడుతున్నారు. ప్రభుత్వం పూర్తిగా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నదని, కేంద్రం నుంచి రావల్సిన ఎరువులు ఇప్పటి వరకు తెప్పించుకోలేదని, గతేడాది ఉన్న నిల్వలనే ఇప్పటి వరకు పంపిణీ చేస్తున్నారని, ఈ కారణంగానే యూరియాకు తీవ్రమైన కొరత ఏర్పడిందని చెబుతున్నారు. జిల్లా మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ ఉన్నప్పటికీ తమకు ఈ దుస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ఆర్ఎఫ్సీఎల్పైనే ఆశలు
ఉమ్మడి జిల్లా పరిధిలోని రామగుండంలో ఉన్న ఆర్ఎఫ్సీఎల్పైనే రైతులు ఆశలు పెంచుకుంటున్నారు. ఈ ఎరువుల కర్మాగారం నుంచి ప్రతి సీజన్లో రాష్ర్టానికి 60 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు ఇవ్వాలని ఒక నిబంధన ఉంది. ఈ నిబంధన ప్రకారం ఇప్పటి వరకు కొన్ని ఎరువులు, ముఖ్యంగా యూరియా సరఫరా చేసినట్టు తెలుస్తున్నది. అయితే ఈ కార్మాగారంలో తరుచూ ఉత్పత్తి నిలిచిపోతున్నది. సాంకేతిక కారణాల వల్ల ఈ నెల 14 నుంచి యూరియా ఉత్పత్తి ఆగిపోయింది. ఈ నెల 22 తర్వాతనే తిరిగి ఉత్పత్తి ప్రారంభించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఈలోగా తమ పంటలకు అదును తప్పుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఎఫ్సీఎల్ ఉత్పత్తి ప్రారంభిస్తే తప్పా జిల్లాకు యూరియా వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న నిల్వలు సరిపోయేలా లేవు. ఈ నెల 22 వరకు ఆర్ఎఫ్సీఎల్ ఉత్పత్తి ప్రారంభించినా అప్పటికపుడు కేటాయించే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో దిక్కుతోచని పరిస్థితిలో రైతులు కనిపిస్తున్నారు.
ఉదయం నుంచే బారులు
వీర్నపల్లి, ఆగస్టు 18 : ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ సహకార సంఘం పరిధిలోని వీర్నపల్లి, రంగంపేట గ్రామాలకు 225 బస్తాల చొప్పున 450 యూరియా బస్తాలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న రైతులు సోమవారం ఉదయం ఆయా గ్రామపంచాయతీల వద్దకు పరుగులు తీశారు. గంటల తరబడి నిల్చున్నారు. పోలీస్ పహారా మధ్య టోకెన్లు ఇచ్చి, ఒక్కొక్కరికి ఒక్కో బస్తా అందజేశారు. వీర్నపల్లిలో 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రంగంపేటలో సాయంత్రం 5నుంచి రాత్రి 8గంటల వరకు పంపిణీ చేశారు. అయితే చాలా మందికి యూరియా దొరక్కపోవడంతో నిరాశ చెందారు.
పడిగాపులు
కోనరావుపేట, ఆగస్టు 18: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట సింగిల్ విండో పరిధిలోని గోదాంకు 440బస్తాలు రాగా, రైతులు ఉదయం నుంచే బారులు తీరారు. క్యూలైన్లో నిల్చొని పడిగాపులు గాశారు. ఎకరానికి బస్తా చొప్పున పంపిణీ చేయగా, అవి కూడా కొంత మందికి అందక నిరాశగా ఇంటికెళ్లారు. ప్రభుత్వం యూరియా కొరత లేదని చెబుతున్నదని, కానీ, బస్తాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
కొరత కాంగ్రెస్ పాపమే
మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
గంగాధర, ఆగస్టు 18: రాష్ట్రంలో యూరియా కొరతకు కాంగ్రెస్ ప్రభుత్వ పాపమే కారణమని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ముందుచూపు లేకపోవడం వల్లే రైతులు గోస పడాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. సోమవారం గంగాధర మండలంలోని గర్శకుర్తి గ్రోమోర్ కేంద్రం వద్ద ఎరువుల కోసం ఎదురు చూస్తున్న రైతులను ఆయన పలుకరించారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడు వెల్లబోసుకున్నారు. రెండు రోజులుగా పనులు వదులుకొని యూరియా కోసం వస్తున్నామని, 1200 కైకిలి పోయిందని వాపోయారు.
అనంతరం రవిశంకర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎక్కడ చూసినా యూరియా కొరత ఉన్నదని, రైతులు ఇబ్బంది పడుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయని చెప్పారు. కేసీఆర్ పాలనలో ఎన్నడూ యూరియా కోసం ఇబ్బంది పడలేదని, కానీ కాంగ్రెస్ పాలనలో రైతులు గోస పడాల్సి వస్తున్నదని ఆవేదన చెందారు. ఉమ్మడి రాష్ట్రంలో కనిపించిన చెప్పుల క్యూలైన్ ఇప్పుడు కనిపిస్తున్నదని మండిపడ్డారు. పోలీసుల పహారాలో ఎరువులు పంపిణీ చేసే దుస్థితిలో ప్రభుత్వం ఉన్నదని విమర్శించారు. సరిపడా ఎరువులు సరఫరా చేయడం చేతకానీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 16 మంది ఎంపీలు ఉన్న తెలంగాణకు తెచ్చింది గుండుసున్నా అని ఎద్దేవా చేశారు. రైతులు సరపడా యూరియా సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఏడెకరాలకు ఒక్క సంచి ఎట్ల సరిపోతది?
నాది ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్. నాకు ఏడెకరాల పొలమున్నది. నేను నాటేసి ఇరవై రోజులైంది. ఏడెకరాల పొలానికి ఒక్కటే బ్యాగు ఇత్తమంటుర్రు. నేను సోమవారం పొద్దుగాల్ల ఆరు గంటలకే అల్మాస్పూర్ గోదాంకు వచ్చి లైన్ కట్టిన. ఒక్కటే బ్యాగు ఇచ్చిన్రు. ఆది ఎట్ల సరిపోతది? మొన్నటి సంది లోడు వస్తది ఇస్తమని చెప్పి, అచ్చినంక ఒక్క సంచి ఇయ్యవట్టిరి. లోడు అచ్చినప్పుడల్ల ఒక్కటిత్తె ఏం సరిపోతది? ఏడెకరాల కోసం నేను ఎన్ని సార్లు తిరగాలి. ఇట్ల రైతులను గోస పెట్టుడు సరికాదు.
-బీపేట లింగం యాదవ్, రైతు, అల్మాస్పూర్ (ఎల్లారెడ్డిపేట మండలం)
గింత తిప్పల ఎప్పుడూ పడలే
నేను ఇరవై ఏండ్లుగా వ్యవసాయం చేస్తున్న. నాటు వేశాక యూరియా కోసం గింత తిప్పలు ఎప్పుడూ పడలే. పరిస్థితి ఘోరంగా ఉంది. మేం తెలిసినకాడల్లా తిరిగి కొన్ని బస్తాలు తెచ్చుకున్నం. ఒక లోడు వచ్చిందంటే వంద మంది రైతులు వస్తున్నరు. దీంతో అవి సరిపోతలేవు. చాలా ఇబ్బందిగా ఉంది. పొలం వేసి నెలకావస్తంది. ఎప్పుడో చల్లాల్సి ఉండె. కానీ, కొంత పొలానికే చల్లినం. మా సైడ్ చాలా మంది రైతులకు యూరియా దొరుకుత లేదు. ప్రభుత్వం యూరియా కష్టాలు లేకుండా చర్యలు తీసుకోవాలె.
-వేల్పుల శ్రీనివాస్, రంగపేట (మానకొండూర్ మండలం)
కేసీఆర్ సర్కారే మంచిగుండె
కేసీఆర్ సర్కారే మంచిగుండె. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎరువులకు కొరత లేకుండె. ముందుచూపుతోటి యూరియా తెప్పించిండు. ఈ ఏడాది యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నం. నేను ఐదెకరాల్లో వరి వేసిన. నాకు పది బస్తాల యూరియా అవసరం ఉన్నది. సొసైటీ వాళ్లను అడిగితే బస్తాలు రాలేదంటున్నరు. వచ్చినా ఒక్కరికి రెండు బస్తాలే ఇస్తరట. ఇలా అయితే ఎవుసం ఎలా చేయాలె. గత పదేండ్లలో ఇసొంటి గోస పడలేదు. కాంగ్రెస్ సర్కారు వచ్చినకం మా పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.
– భైకాని మహిపాల్, రంగరావుపల్లి (గంగాధర మండలం)