Collector Koya Sriharsha | పెద్దపల్లి రూరల్ , నవంబర్ 14: పిల్లలకు ఉజ్వల భవిష్యత్ అందించేందుకు అందరం కలిసి కట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. పెద్దపల్లి మండలంలోని కొత్తపల్లి లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో జరిగిన సమావేశంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు కోసం ప్రణాళికాబద్దంగా అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
పిల్లల హాజరు శాతంతో పాటు పాఠశాలలో నాణ్యమైన బోధన, ఆంగ్ల బోధన, కెరియర్ గైడెన్స్ వంటి అంశాలలో విద్యార్థులకు తోడుగా ఉండాలన్నారు. పిల్లలు పాఠశాలకు రెగ్యులర్ గా హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలకు విద్యార్థులు రాని పక్షంలో వెంటనే ఫాలో అప్ చేయాలన్నారు. పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోధన జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. సులభ పద్ధతుల్లో బోధన జరిగేలా కూడా మార్పులు చేయడం జరుగుతుందన్నారు.
జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగేందుకు ఆంగ్ల భాష పరిజ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్, కెరియర్ గైడెన్స్, ఎక్స్పోజర్ విజిట్స్ చాలా అవసరమన్నారు. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు దీటుగా మన పిల్లలకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పేరెంట్ టీచర్స్ మీటింగ్ లకు తల్లిదండ్రులు రెగ్యులర్ గా హాజరు కావాలని కలెక్టర్ కోరారు. అనంతరం జడ్పీహెచ్ఎస్ లోని అంగన్ వాడీ కేంద్రాన్ని పరిశీలించి పిల్లలకు నాణ్యమైన భోజనంతోపాటు విద్యను అందించాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ ఎం ఉపాధ్యాయులు పాల్గొన్నారు.