Huzurabad | హుజురాబాద్ టౌన్, జూలై 11: ప్రతీ ఒక్కరూ లింగ వివక్షను వ్యతిరేకించాలని చెల్పూర్ వైద్యాధికారి డాక్టర్ మధూకర్ పిలుపునిచ్చారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని చెల్పూర్ పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ మధుకర్ ఆధ్వర్యంలో చెల్పూర్ గ్రామంలో శుక్రవారం జనాభా దినోత్సవ అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ మధుకర్ మాట్లాడుతూ ప్రపంచ జనాభా దినోత్సవం ఉత్సవాలను ఈ నెల 11 నుండి 25 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 14న హుజరాబాద్ లోని ఏరియా ఆసుపత్రిలో పురుషులకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల శిబిరం ఉందని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. యువకులందరూ లక్ష్యాలను చేరుకొని కుటుంబాలను ఉన్నత శిఖరాల వైపు సాగే విధంగా వనరులను సద్వినియోగం చేసుకొని ఆశాజనక ప్రపంచం వైపు సాగిపోవాలని అన్నారు.
లింగవివక్షతను విడనాడాలని ఆడపిల్లలను పురిటిలోనే చంపే విధానాలకు స్వస్తి పలకాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, ఎంపీహెచ్వో సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.