District Legal Authority | సుల్తానాబాద్ రూరల్, జూన్ 19 : సమాజంలో జరిగే నేరాలు తగ్గాలంటే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా లీగల్ అథారిటీ సెక్రెటరీ స్వప్న రాణి సూచించారు. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల్ల గ్రామంలో గురువారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా లీగల్ అథారిటీ సెక్రటరీ స్వప్న రాణి మాట్లాడుతూ నేడు సమాజంలో యువత మద్యపానానికి అలవాటై మత్తులో ఉంటూ తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, యువతను దారిలో పెట్టాల్సిన బాధ్యత ఉందని తెలిపారు.
అంతేకాకుండా మహిళలు పిల్లల్ని పెంచి వారిని ప్రయోజకులను చేసే విధంగా తీర్చిదిద్దాలని సూచించారు. మహిళలు లైంగిక వేధింపులకు, వరకట్న వేధింపులకు బలవుతున్నారని మైనర్ బాలికలపై లైంగిక వేధింపులు జరిగితే కఠిన చర్యలు ఉంటాయని ఫోక్సొ కేసు వంటివి నమోదు చేసి కఠినంగా శిక్షలు ఉంటాయని అవగాహన కల్పించారు. నిరుపేదలు న్యాయవాదికి వారి సమస్యలపై ఫీజులు చెల్లించలేని పరిస్థితి ఉంటే కోర్టులో దరఖాస్తు చేస్తే సంబంధిత వ్యక్తికి ఎలాంటి డబ్బులు లేకుండా న్యాయ సేవాసాధికారిక సంస్థ ఆధ్వర్యంలో వాదించే విధంగా చర్యలు చేపట్టామని సూచించారు.
ఫ్రీ లీగల్ సర్వీసును సద్వినియోగం చేసుకోవాలన్నారు. సీనియర్ సిటిజన్స్ పట్ల వారికి తిండి పెట్టక బాగోగులు చూసుకోకుంటే తల్లిదండ్రులు రెవెన్యూ డివిజనల్ అధికారికి ఫిర్యాదు చేస్తే వారికి నెలవారీగా బత్యం చెల్లించే విధంగా ఆదేశాలు జారీ చేస్తారని ఒకవేళ కుటుంబ సభ్యులపై భూమి రిజిస్ట్రేషన్ చేస్తే దానిని రద్దు పరచే అవకాశం కూడా ఉంటుందని పేర్కొన్నారు. చిన్న చిన్న తగాదాల వల్ల జరిగే గొడవలతో కోర్టుల చుట్టూ తిరిగే అవకాశం లేకుండా సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో. న్యాయవాదులు మామిడిపల్లి శరత్ కుమార్, భాను కృష్ణ, ఝాన్సీ, గ్రామ స్పెషల్ అధికారి సచిన్ కార్యదర్శి సునీత తో పాటు పొ న్నం చంద్రయ్య గౌడ్, దాసరి సతీష్, రమేష్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.