పెద్దపల్లి జిల్లా మీదుగా వెళ్తున్న నాగ్‌పూర్-విజయవాడ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ నేషనల్ హైవే(ఎన్‌హెచ్-163) నిర్వాసితులకు పరిహారం పరిహాసంగా మారుతున్నది. వచ్చే నెలలో పనుల ప్రారంభానికి యంత్రాంగం కసరత్తు చేస్తుండగా, ఇంకా పంపిణీలో జాప్యం జరుగుతున్నది. పలువురి భూముల్లో ఉన్న విలువైన ఇండ్లు, భూమి, బావులు పోతున్నా రికార్డు చేయకుండా, కొందరికి డబ్బులు ఇవ్వకుండా దాట వేస్తున్నట్టు తెలుస్తున్నది. అధికారులు ఇంకా పదిహేను శాతమే ఇవ్వాల్సి ఉందని చెబుతున్నా.. నిర్వాసితులు మాత్రం 30శాతం దాకా ఇవ్వాల్సి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందరికీ పరిహారం ఇచ్చిన తర్వాతే హైవే పనులు ప్రారంభించాలని స్పష్టం చేస్తున్నారు.
పెద్దపల్లి, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : నాగ్‌పూర్-విజయవాడ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ నేషనల్ హైవే (ఎన్‌హెచ్-163)లో భాగంగా మంచిర్యాల-వరంగల్ జిల్లాల మధ్య మొదటి ప్యాకేజీలో నిర్మించనున్న జాతీయ రహదారి నిర్వాసితులకు పరిహారం పంపిణీ నత్తనడకన సాగుతున్నది. గతేడాది జూలైలో హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో రహదారి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. కానీ, పదిహేను నెలలు గడిచినా పెద్దపల్లి జిల్లాలో పనులు ప్రారంభానికి నోచుకోలేదు. ఎట్టకేలకు నవంబర్ 15 నుంచి పనులు మొదలవుతాయని ఇటీవల కలెక్టర్ ప్రకటించారు. అయితే భూసేకరణ, పరిహారం ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో కొత్తగా నిర్మించే జాతీయ రహదారి-163 నిర్మాణానికి 2021 ఫిబ్రవరి 3న గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ జాతీయ రహదారి మొత్తం 473 కిలోమీటర్లు కాగా, మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి మొదలై ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ముగుస్తుంది. 2027 కల్లా పూర్తిచేసే లక్ష్యంతో ఈ నాలుగు లైన్ల ఎక్స్‌ప్రెస్ హైవే పనులను ప్యాకేజీలుగా విభజించి చేపడుతున్నారు. మొదటి విడుత మూడో ప్యాకేజీ కింద మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండలం వేలాల నుంచి పెద్దపల్లి ముత్తారం మండలం ఓడేడ్ వరకు 37.96 కిలోమీటర్లు తీసుకున్నారు. అయితే రహదారి నిర్మాణానికి సంబంధించి భూసేకరణకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఎన్నికలకు ముందు వేగంగా ప్రక్రియ సాగగా, ఆ తర్వాత మందకొడిగానే సాగుతున్నది. జిల్లాలోని మంథని, రామగిరి, ముత్తారం మండలాల్లోని 15 గ్రామాల మీదుగా హైవే వెళ్లనుండగా, ఇప్పటి వరకు 85శాతం మాత్రమే భూసేకరణ, పరిహారం పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ రహదారి పూర్తయితే మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలతోపాటు కరీంనగర్, జయశంకర్- భూపాలపల్లి జిల్లావాసులకు నేషనల్ హైవే అందుబాటులోకి రానుంది.
ఈ రహదారి జిల్లా పరిధిలో మంథని మండలం ఉప్పట్ల నుంచి పోతా రం, విలోచవరం, నాగారం, కన్నాల, పుట్టపాక, రామయ్యపల్లి, రామగిరి మండలం ఆదివారంపేట, బేగంపేట, నవాబ్‌పేట, ముత్తారం మండలం లకారం, కేశన్‌పల్లి, ముత్తారం, అడవి శ్రీరాంపూర్, ఓడేడు మీదుగా వరంగల్ జిల్లాలోకి వెళ్తుంది. మూడు మండలాలు, 15 గ్రామాల మీదుగా వెళ్లే ఈ దారి పొడవు 37.96 కిలోమీటర్లు కాగా, దీని నిర్మాణానికి 505.25 ఎకరాల భూమి అవసరమవుతుందని హైవే అథారిటీ సూచించింది. అయి తే, భూసేకరణ, పరిహారం పంపిణీ పూర్తి కాకపోవడం, వచ్చే నెల నుంచి పనులు ప్రారంభకానున్న నేపథ్యంలో నిర్వాసిత రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు 15 శాతమే పరిహారం ఇవ్వాల్సి ఉందని చెబుతున్నారని, కానీ, నిజానికి 30 శాతం దాకా ఇవ్వాల్సి ఉందంటున్నారు. భూసేకరణలో భూముల్లో ఉన్న బోర్లకు, పైపు లైన్లకు, చెట్లకు, షెడ్లు, ఇతర నిర్మాణాలకు ఎలాంటి డబ్బులు ఇవ్వడం లేదని వాపోతున్నారు. తక్షణమే పరిహారం పంపిణీ చేయాలని, ఆ తర్వాతే పనులు ప్రారంభించాలని కోరుతున్నారు. కలెక్టర్‌కు వస్తూ అధికారులను వేడుకుంటున్నారు.
గ్రీన్ ఫీల్డ్ హైవే కింద మా ఆదివారంపేట గ్రామ శివారులో భూములు పోతున్నయి. ఇప్పటివరకు 30 మంది రైతులకు పరిహారం జమ కాలేదు. ఇంకా భూముల్లో ఉన్న బోర్లకు, బావులకు, పైప్ లైన్లకు, చెట్లకు డబ్బులు వేయలే. ఇంకా కొన్ని శాఖల వాళ్లు అసలు సర్వేనే చేయలేదు. ఎస్టిమేట్లు చేయలేదు. మిస్సింగ్ అయిన వాటి గురించి చెప్పినా పట్టించుకునే అధికారులు లేరు. వచ్చే నెల 15 నుంచి రోడ్డు పనులు ప్రారంభిస్తామని అంటున్నరు. పరిహారం ఇచ్చిన తర్వాతనే పనులు చేయాలి.
-మైదం కుమార్, మాజీ సర్పంచ్ ఆదివారంపేట (రామగిరి మండలం)
నాకు లక్కారం శివారులో 15 ఎకరాల భూమి ఉన్నది. దానికి తగ్గట్టుగానే పెద్ద బావి తవ్వించుకున్న. ఆ బావి నీళ్లే ఆధారం. అయితే, వ్యవసాయ భూమిలో నుంచి 4 గుంటల భూమి, బావి హైవే కింద పోతున్నది. అంత పెద్ద బావి, భూమి కోల్పోతున్నా ఇప్పటివరకు నాకు ఒక్క రూపాయి పరిహారం ఇవ్వలె. అధికారులను అడిగితే వస్తాయని అంటున్నరు. ఇంకెప్పుడిస్తరో తెలుస్తలేదు. పరిహారం ఇచ్చిన తర్వాతే పనులు ప్రారంభించాలి.
– గొర్ల మహేశ్, మచ్చుపేట (ముత్తారం మండలం)
..పక్క ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తిపేరు రొడ్డ సాయికృష్ణ. ఊరు మంథని మండలం పుట్టపాక. ఇతనికి గ్రామ శివారులోని సర్వే నంబర్ 379, 380లో 32 గుంటల వ్యవసాయ భూమి ఉంది. నేషనల్ హైవే కోసం అధికారులు భూమిని తీసుకున్నారు. మొదటి విడుత పరిహారం పంపిణీలో ఎకరానికి 6లక్షలు ఇస్తున్నారని, అందులో అవకతవకలున్నాయని అప్పుడు సాయికృష్ణ సంతకం చేయలేదు. తర్వాత అధికారులు పరిహారాన్ని పెంచారు. అయితే 32 గుంటల భూమితో పాటు బోర్, బావి, ఇల్లు కూడా హైవే నిర్మాణంలో పోతుండగా, అధికారులు బోరు, బావి, ఇల్లును మాత్రం రికార్డు చేయడం లేదు. వ్యవసాయ భూమిలో ఉన్న బోర్ ఆన్ చేసి చూపించినా, కరెంట్ బిల్లు, ఇంటి ఘర్‌పట్టి బిల్లులు ఇలా అన్నీ చూపించినా పట్టించుకోలేదు. ఇప్పటి వరకు పరిహారం కింద సాయికృష్ణకు ఒక్క రూపాయి కూడా రాలేదు. అయితే వచ్చే నెలలో రోడ్డు పనులు ప్రారంభమవుతాయని అధికారులు చెబుతుండడంతో ఆందోళన చెందుతున్నాడు.