Farmers | ఎల్లారెడ్డిపేట, మే 15: మిల్లోల్లు అడిగినంత తూకం పెట్టినా వెయిట్ లాస్ అంటూ ధాన్యంలో కోతను విధించిన తీరుపై బొప్పాపూర్‌లో రైతులు నిర్వాహకుడితో వాగ్వాదానికి దిగిన ఘటన శుక్రవారం జరిగింది. బొప్పాపూర్‌లోని ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద పోసిన ధాన్యం మొదట్లో 42.200 గ్రాములు తూకం పెట్టినట్లు తెలిపారు. కొద్ది రోజులకు తమకు గిట్టుబాటు కాదని 42.500 కేజీలు పెడితే వెయిట్‌లాస్ ఉండదని తమకు ఇబ్బందుల్లేకుండా తీసుకుంటామని మిల్లర్లు చెబితే ఈ నెల 5వ తేదీన అంతే మొత్తంలో తూకం వేసి 960 సంచులు మిల్లుకు పంపినట్లు తెలిపారు. అదే వే బ్రిడ్జిపై అదే రోజు తూకం వేసినప్పటికీ తమకు ఎలాంటి సమాచారం అందించలేదని రైతులు చెప్పారు.
కాగా శుక్రవారం ట్రక్‌షీట్‌లో 960 బస్తాల్లో వెయిట్ లాస్ ఉందని 5 క్వింటాల్లు కోత విధించినట్లు నిర్వాహకుడు రైతులకు ట్రక్‌సీట్ పేపర్‌ను చూపించగా రైతులు నిర్వాహకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తూకం వేసిన రోజే అన్లోడ్ అయితే వెయిట్‌లాస్ ఎలా అవుతుందని ఒక్కో క్వింటాలుకు ఒక కిలో చొప్పున ఎలా కోత విధిస్తారని ఇందుకు నిర్వాహకులే బాధ్యత వహించాలని వాగ్వాదానికి దిగారు. ఒక వేల వెయిట్ లాస్ వస్తే తూకం వేసిన రోజు వెయిట్ లాస్ వస్తుందని రైతులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని నిలదీశారు. అధికారులు మిల్లర్ల దోపిడీపై మౌనంగా ఉండటం వల్లే ఇలాంటి కోతలు విధిస్తున్నారని తమకు సమాచారమివ్వకుండా కోత విధించిన మిల్లుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా అదే రోజు నుంచి కొనుగోలు కేంద్రంలోని గోదాముల్లో దింపుకుంటున్న వడ్లకు ఎలాంటి కోతల్లేవని కేవలం మిల్లుల్లో మాత్రమే కోతలు విధిస్తున్నారని రైతులు వాపోయారు.
అడిగినంత పెట్టినా కోతలేంది..
మేము మిల్లోల్లు ఎంత అడిగితే అంత పెట్టినం. 42.200 సరిపోదు 42.500 కేజీలు పెట్టాలని చెప్పితే అంత పెట్టినం. వడ్ల మ్యాచర్ వచ్చిందా లేదా అని మేడం అడిగితే వ్యవసాయ మార్కెట్ వద్దకు 42.200 గ్రాములు తూకం వేసి తీసుకపోతే అందులో కేవలం 400 గ్రాములు మాత్రమే తరుగు వచ్చిందని అది అధికారుల కండ్లముందే జరిగిందని అన్నారు. అంటే ఒక బస్తాకు అదనంగా 1.800 కేజీలు అందులో బస్తా బరువు 700 అనుకున్నా ఒక్కో బస్తా వెంట అదనంగా ఒక కిలో చొప్పున నా ఒక్కడియే పొయినయ్. అంటే నేను 50 బస్తాలు పంపితే నా ఒక్కడికే అద్ద క్వింటాలు లాస్ చేసిరు రైస్మిల్లోల్లు. జోకినంక పది రోజులకు 5క్వింటాల్లు లోడుమీద కట్ అయినయని చెప్పుతున్నరు. 960 బ్యాగులకు 5క్వింటాల్లు కట్ అయినయంటే కింటాలుకు కిలో కట్ చేసిరు. జోకినంక వడ్లు ఆగినయ్, అన్లోడ్ కాలేదు అంటే వెయిట్‌లాస్ అని అనుకోవచ్చు. అప్పుడు దించుకున్నంక వెయిట్‌లాస్ ఎట్ల. ఇక్కడ గోదాముల దించితే ఏ కటింగ్ లేదు. మిల్లులల్లనే గోసగోస చేస్తున్నరు. మొత్తం ధాన్యం గవర్నమెంట్ గోదాములాల్ల దించితేనే కటింగ్ కాదనిపిస్తున్నది.
– వంగ పద్మారెడ్డి, రైతు, బొప్పాపూర్, ఎల్లారెడ్డిపేట