కరీంనగర్ తెలంగాణచౌక్, ఆగస్టు 12 : ఇక రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సులు రయ్.. రయ్‌మని దూసుకెళ్లనున్నాయి. డీజిల్ వ్యయాన్ని తగ్గించుకోవాలనే లక్ష్యంతో ఆర్టీసీ పర్యావరణ హితమైన ఎలక్ట్రికల్ బస్సుల వైపు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే కాగా, రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి బస్సులను కొనుగోలు చేసింది. ప్రతి రీజియన్‌లో ప్రయాణికుల రద్దీని బట్టి కేటాయించింది.
కరీంనగర్ రీజియన్‌కు వంద బస్సులు అవసరం ఉంటాయని ఉన్నతాధికారులు నివేదిక పంపించగా, కొత్తగా కొనగోలు చేసిన ఎలక్ట్రికల్ బస్సుల్లో ప్రస్తుతం 70 సూపర్ లగ్జరీ బస్సులను కేటాయించారు. అందులో 35 కరీంనగర్ జోనల్ వర్క్ షాపునకు వారం కిందటే చేరుకోగా, ఇప్పటికే బస్సుల చార్జింగ్ కోసం డిపో -2 లో 14 పాయింట్లతో స్టేషన్ ఏర్పాటు చేశారు.
మూడు గంటల చార్జింగ్‌తో 350 కిలోమీటర్లు
బస్సు బ్యాటరీ ఫుల్ చార్జింగ్ కోసం మూడు గంటల సమయం పట్టనున్నది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 350 కిలో మీటర్లు నడుస్తుందని అధికారులు తెలిపారు. విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ శాఖతో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకున్నారు. బస్సుల నిర్వహణ అద్దె ప్రాతిపదికన (జిసీసీ-గ్రాస్‌కాస్ట్ కాంట్రాక్ట్) పద్ధతిన జేబీఎం(జై భారత్ మారుతి) సంస్థకు అప్పగించారు. బస్సులో కండక్టర్, ఆర్టీసీ సిబ్బంది ఉండనున్నారు. పర్యవేక్షణ ఆపరేషన్స్ మాత్రమే ఆర్టీసీ చూసుకుంటుంది. డ్రైవర్, రిపేర్స్ జేబీఎం సంస్థ నిర్వహిస్తుంది.
ఇప్పటికే ప్రైవేట్ డ్రైవర్లను ఎంపిక చేయడమే కాకుండా వారందరికీ సంస్థ శిక్షణ కూడా ఇస్తున్నది. ప్రస్తుత కొత్త ఎలక్ట్రిక్ బస్సుల్లో 33 బస్సులను కరీంనగర్ -జేబీఎస్ నడిపించనున్నారు. 2 బస్సులు స్పేర్‌లో ఉంచారు. మిగతావి వచ్చిన తర్వాత కరీంనగర్-జేబీఎస్, కరీంనగర్-గోదావరిఖని, కరీంనగర్-కామారెడ్డి, కరీంనగర్-జగిత్యాల, కరీంనగర్-సిరిసిల్ల రూట్లకు కేటాయించనున్నారు. జిల్లాకు చెందిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఈ నెలలో ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.
త్వరలోనే ప్రారంభిస్తాం
రీజియన్‌కు కేటాయించిన ఎలక్ట్రికల్ బస్సులు వర్క్‌షాపులకు చేరుకున్నాయి.70 బస్సులకు 35 మొదటి దశలో వచ్చాయి. అందులో రెండు బస్సులను స్పేర్‌లో ఉంచాం. మిగతా 33 బస్సులను కరీంనగర్ నుంచి జేబీఎస్‌కు నడిపిస్తాం. బస్సుల చార్జింగ్ కోసం డిపో-2లో చార్జింగ్ స్టేషన్ ఏర్పాటైంది. రెందో దశలో రానున్న 35 బస్సులను హైదరాబాద్‌తో పాటు రీజియన్‌లో ఇతర ప్రాంతాలకు నడిపించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. పర్యావరణ హిత మైన ఎలక్ట్రికల్ బస్సుల వల్ల డీజిల్ ఆదా అవుతుంది. పర్యావరణ రక్షణకు తోహదపడుతుంది.
– సుచరిత, రీజియన్ మేనేజర్ (కరీంనగర్)